దిల్లీలో శుక్రవారం జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకునే ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక విచారణ అనంతరం నిర్ధరణకు వచ్చారు. పేలుడు ప్రదేశంలో నిందితులు వదిలివెళ్లిన లేఖను ఫోరెన్సిక్ బృందం స్వాధీనం చేసుకున్నట్లు దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్ రాయబారిని బెదిరిస్తూ ఆంగ్లంలో ఈ లేఖ రాసినట్లు పేర్కొన్నారు. ఇది కేవలం 'ట్రైలర్' అని లేఖలో ఉందని చెప్పారు.
గతేడాది ఇరాన్‌కు అణు శాస్త్రవేత్త, జనరల్ అధికారిని చంపిన విషయాన్ని నిందితులు లేఖలో ప్రస్తావించినట్లు అధికారులు తెలిపారు. దానికి ప్రతీకారంగానే ఇజ్రాయిల్ ఎంబసీని లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు.
రెక్కీ నిర్వహించాకే..
ఇజ్రాయిల్ ఎంబసీ ఎదురుగా ఉన్న జిందాల్ హౌస్ వద్ద ఉన్న సీసీటీవీ పనిచేయడం లేదని, జిందాల్ హౌస్ పక్కన ఉన్న మరో బంగ్లా వద్ద ఉన్న సీసీటీవీ కెమెరా పాడైపోయిందని పోలీసులు గుర్తించారు. సీసీటీవీ పనిచేయడం లేదని నిర్ధరించుకున్న తర్వాతే నిందితులు దాడికి పాల్పడ్డారని భావిస్తున్నారు. ముందుగా రెక్కీ నిర్వహించే పేలుడు పదార్థాలు అనుకున్న ప్రదేశంలో పెట్టి హెచ్చరించి ఉంటారని అనుమానిస్తున్నారు. పేలుడు తీవ్రత తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నా.. పదార్థం మాత్రం ఎక్కువగా ఉపయోగించారని పేర్కొన్నారు.
అప్రమత్తంగా ఉన్నాం..
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పలు ఘటనల దృష్ట్యా తమను లక్ష్యంగా చేసుకుంటారని తెలిసే కొద్దికాలంగా అప్రమత్తంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ రాయబారి రోన్ మల్కా తెలిపారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలకు తామే కారణని ఇరాన్ ఆరోపిస్తోందన్నారు. ఘటనపై భారత్‌తో కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పేలుడును ఉగ్రవాద చర్యగానే తాము భావిస్తున్నామని చెప్పారు.