90 Years Old Man Committed Suicide In Siddipet: పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు .. వారే తమ జీవితమని, కడవరకు చూస్తారని నమ్ముతారు. తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ.. వారి ఆలనాపాలనా చూసుకుంటారు. వారికి చిన్న కష్టం వచ్చినాసరే.. తమ ప్రాణం పోయేంతలా కన్నవారు విలవిలలాడుతారు. తీరా వారు పెద్దవారైన తర్వాత చూస్తే.. అమ్మానాన్నలే అవసరం లేదని చెప్పేసిన కుమారులు, కుమార్తెలు కూడా ఈ లోకంలో ఉన్నారు. వారి దగ్గర నుంచి ఆస్తి కావాలి కాని.. కన్నవారు మాత్రం అవసరం లేదు. వారిని కన్న పాపానికి చివరుకు వీధిపాలు చేసి.. అభాగ్యులుగా మార్చేస్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లాలో ఓ వృద్ధుడు చనిపోయిన తీరు అందరికి కన్నీళ్లను తెప్పిస్తున్నాయి. భర్త చనిపోతే భార్య బతికుండగానే చితిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం నాటి సతీసహగమనం అయితే.. నేడు బతికున్న కన్న తండ్రి చితి పేర్చుకుని అందులో దూకి ఆత్మహత్య చేసుకోవడాన్ని ఏమనాలి..?
తొంభై ఏళ్ల వయసున్న వెంకటయ్య సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో నివాసం ఉంటున్నారు. భార్య గతంలోనే తనువు చాలించింది. వీరి దాంపత్య జీవితంలో నలుగురు కుమారులు కనకయ్య, ఉమ్మయ్య, పోచయ్య, ఆరయ్య, ఓ కుమార్తె పుట్టారు. వెంకటయ్య తనకున్న స్థిరాస్తిని, నాలుగు ఎకరాలకు భూమిని పిల్లలకు పంచి ఇచ్చారు. తన పిల్లలు కూడా వ్యవసాయ పనులు చేసుకుంటూ.. తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ: ఆ కుమారుల్లో ఇద్దరు పొట్లపల్లిలో, ఒకరు హుస్నాబాద్లోనూ, మరొకరు కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం నవాబుపేటలో నివసిస్తూ కుటుంబ పోషణ చూసుకుంటున్నారు. పొట్లపల్లిలో నివాసం ఉంటున్న పెద్ద కుమారుడు కనకయ్య ఇంటి వద్దనే.. వృద్ధాప్యంలో ఉన్న వెంకటయ్య ఉండేవారు. ఆ ముసలివానికి వృద్ధాప్య పింఛను కూడా వస్తోంది. ఆ 90 ఏళ్ల తండ్రి పోషణ చూసుకోలేక.. కుమారులు అయిదు నెలల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించారు. నెలకు ఒకరు చొప్పున వంతుల వారిగా పోషించాలని కుమారులు నిర్ణయించుకున్నారు.
సొంతూరిని.. ఇంటిని వదలలేక: అప్పటికే పెద్ద కుమారుడి ఇంటి వద్ద ఉంటున్న వెంకయ్య.. అక్కడి వంతు పూర్తి కావడంతో నవాబుపేటలో ఉంటున్న కుమారుడి ఇంటి వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సొంత ఊరిని, ఇంటిని వదిలి.. వెళ్లనని కుమారులకు చెప్పేశాడు. అయినా సరే వెళ్లాలిన అవసరం ఉంది కాబట్టి.. ఈ నెల 2న సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరాడు. అక్కడి నుంచి ఆ గ్రామంలోనే ఓ ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్లి రాత్రి అక్కడే బస చేసి.. తన బాధను ఆ పెద్దమనిషికి చెప్పుకున్నాడు.
తానే చితిపేర్చుకుని ఆత్మహత్య?: మరుసటి రోజున 3వ తేదీన ఉదయం నవాబుపేటలోని తన మరో కుమారుడి ఇంటికి వెళ్తానని చెప్పి.. అక్కడి నుంచి వెంకటయ్య బయటకు వచ్చేశాడు. అదే చివరి రోజుగా భావించి.. సాయంత్రం వరకు ఏ కుమారుడి ఇంటి వద్దకు వెళ్లలేదు. తనయులకు భారం కాకూడదనుకున్నారేమో.. చితిలో దూకి తనను తాను ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం కూడా గురువారం మధ్యాహ్నం పొట్లపల్లి గ్రామంలో ఎల్లమ్మగుట్ట వద్ద మంటల్లో కాలిన స్థితిలో వృద్ధుడి మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం వెంకటయ్యదేనని కుటుంబ సభ్యులు గుర్తుపట్టారు. ఘటనాస్థలంలో తాటికమ్మలను ఒక చోట కుప్పగా వేసి.. వాటికి నిప్పంటించి.. అందులో దూకి ఆత్మాహుతికి పాల్పడినట్లు గ్రామస్థులు భావిస్తున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: