85 Year Old Woman Saved From Forest After Two Nights : పశువులను మేపుకుంటూ అడవిలోకి వెళ్లిన 85 ఏళ్ల వృద్ధురాలు దారి తప్పిపోయింది. రెండు రాత్రుల పాటు దట్టమైన అడవిలో మృగాల మధ్య ఉంటూ ప్రాణాలను రక్షించుకుంది. ఎలాంటి ఆహారం లేకుండా గడిపిన ఆమె.. ఎట్టకేలకు సురక్షితంగా బయటపడింది. ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గలో జరిగింది.
ఇదీ జరిగింది
హోసనగర తాలుకాలోని సదగల్లు గ్రామానికి చెందిన శారదమ్మ.. ఆదివారం పశువులను మేపుకుంటూ అడవిలోకి వెళ్లింది. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడం వల్ల ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు రాత్రంతా వెతికారు. అయినా ఆచూకీ లభ్యం కాకపోవడం వల్ల సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కుటుంబసభ్యులు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అటవీ అధికారుల సహాయంతో బావులు, సరస్సులు సహా సమీప గ్రామాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రి గడిచినా దొరకకపోవడం వల్ల డాగ్ స్క్వాడ్‌ను రప్పించి వెతికారు. మంగళవారం కూడా అధికారులతో వెతికినా శారదమ్మ ఆచూకీ లభించకపోవడం వల్ల.. మృగాల బారిన పడి ఉంటుందని భావించారు ఆమె కుటుంబ సభ్యులు. తిరిగి బుధవారం ఉదయం వెతకడానికి సద్ధమవతున్న తరుణంలో శారదమ్మ క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు.
మృగాల మధ్యే రెండు రాత్రులు
ఆదివారం ఉదయం అడవిలో తప్పిపోయిన శారదమ్మ.. ఎలాంటి ఆహారం లేకుండానే రెండు రాత్రులు గడిపింది. అడవిలో కనిపించిన పశువులతో వెళ్లిన శారదమ్మ.. సావేహక్లు డ్యామ్ సమీపంలోకి వెళ్లింది. ఆ తర్వాత మంగళవారం రాత్రి కబ్బన హిట్టాళు గ్రామం సమీపంలోకి వెళ్లిన ఆమె.. అరవడం ప్రారంభించింది. శారదమ్మ అరుపులు విన్న సురేశ్ శెట్టి.. వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లి ఆమెను రక్షించి పోలీసులకు సమాచారం అందించాడు. ఈ విషయం తెలుసుకున్న శారదమ్మ కుటుంబసభ్యలు.. వెంటనే కబ్బన హిట్టాళు గ్రామానికి వెళ్లారు. స్వల్ప గాయాల పాలైన ఆమెను.. శివమొగ్గలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. "శారదమ్మ కోసం మూడు రోజులుగా వెతికాం. మంగళవారం సాయంత్రం ఆమెతో వెళ్లిన కుక్క సైతం తిరిగి వచ్చింది. అయినా సరే వదలకుండా వెతుకుతూనే ఉన్నాం. ఈ క్రమంలోనే కబ్బన హట్టాళు గ్రామంలో ఆమె ఉందని తెలుసుకుని వెళ్లాం. ఆమె ఆచూకీ లభించడం వల్ల ఎంతో ఆనందపడ్డాం. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారు." అని కుటుంబసభ్యులు తెలిపారు.
ఆకుకూరల డాక్టర్.. ఏం తింటే ఏం లాభమో ఇట్టే చెప్పే పెద్దాయన.. 50 రకాలు సాగు
చిన్న ఊరిలో 100 CCTV కెమెరాలు- ప్రెసిడెంట్ చొరవతో ఫుల్ సెక్యూరిటీ!