77th Independence Day Pm Modi Speech : 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం చారిత్రక ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా పదోసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాలు ఈ స్వాతంత్య్ర దినోత్సవంతో ముగుస్తాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యం ఉండాలన్న భావన ప్రకారం దేశం నలుమూలల నుంచి వివిధ వర్గాలకు చెందిన 1,800 మందిని ఈ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. 400 మంది సర్పంచులు, 250 మంది వ్యవసాయ ఉత్పాదక సంఘాల వారు, 50 మంది చొప్పున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం కౌశల్ వికాస్ యోజన లబ్ధిదారులు, సెంట్రల్ విస్టా, నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనుల్లో పాల్గొన్న కార్మికులు, హర్‌ఘర్ జల్ యోజన నిర్మాణ కార్మికులు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు, నర్సులు, మత్స్యకారులు వేడుకల్లో పాలుపంచుకుంటున్నారు.


కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాలు, కార్యక్రమాలతో ముడిపడిన స్వీయచిత్రాలు తీసుకోవడానికి వీలుగా నేషనల్ వార్ మెమోరియల్, ఇండియా గేట్, విజయ్‌చౌక్, న్యూదిల్లీ రైల్వేస్టేషన్, ప్రగతిమైదాన్, రాజ్‌ఘాట్, కొన్ని మెట్రో స్టేషన్ల వద్ద ప్రత్యేక సెల్ఫీపాయింట్లు ఏర్పాటుచేశారు. mygov.in పోర్టల్‌లో ఆగస్టు 15 నుంచి 20 మధ్య ఆన్‌లైన్ సెల్ఫీ పోటీలను రక్షణశాఖ నిర్వహిస్తుంది.

77th Independence Day Of India 2023 : స్వాతంత్ర్య వేడుకలకు దాదాపు 10వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. వేయి ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు అమర్చారు. డ్రోన్లను కూల్చివేసే వ్యవస్థల్ని రంగంలో దించారు. హరియాణాలో ఇటీవలి అల్లర్ల దృష్ట్యా నిఘాను పటిష్ఠం చేశారు. వేడుకలు జరిగే సమయంలో దిల్లీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా ప్రజలంతా తప్పకుండా తమ సామాజిక మాధ్యమాల డీపీగా జాతీయ జెండాను పెట్టుకోవాలని ప్రధాని కోరారు.

స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రధాని నరేంద్ర మోదీ సెల్యూటింగ్ బేస్ వద్దకు చేరుకుని గార్డ్ ఆఫ్ హానర్‌ను స్వీకరిస్తారు. అనంతరం ప్రధాని ఎర్రకోట వద్దకు చేరుకుంటారు. అక్కడ ప్రధానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్- సీడీఎస్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, నౌకాదళం చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్, వైమానిక దళం అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి స్వాగతం పలుకుతారు. అనంతరం ప్రధానమంత్రి జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేస్తారు.
