ఉత్తరప్రదేశ్‌లోని ఖేడా గ్రామానికి చెందిన 62 ఏళ్ల షీలాదేవి... మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనం. వివాహం జరిగిన ఏడాదికే భర్తను కోల్పోయిన షీలాదేవి... తన పోషణ ఎవరికీ భారం కాకూడదని నిశ్చయించుకుంది. 22 ఏళ్లుగా సైకిల్‌పై ఊరూరా తిరుగుతూ పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడు సైతం సాయం కోసం ఎవరినీ అర్థించకుండా మనోనిబ్బరంతో కష్టపడి పనిచేసుకుంటోంది. ఊరి ప్రజలంతా అభిమానంతో ఆమెను షీలా బువా అని పిలుచుకుంటారు.
ఎవరికీ భారం కాకూడదని..
షీలాదేవికి 1980లో వివాహమైంది. ఏడాదికే ఆమె భర్త మరణించాడు. అకస్మాత్తుగా వచ్చి పడిన కష్టంతో దిక్కుతోచని స్థితిలో.. ఖేడాలోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది షీలా. ఎవరికీ భారంగా మారకూడదన్న ఉద్దేశంతో తండ్రికున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేయడం మొదలుపెట్టింది.
"ఈ పని నా కాళ్లమీద నేను నిలబడిగేలా చేసింది. ఈ పనిద్వారానే నా బతుకు బండి నడుస్తోంది."
- షీలాదేవి
మరో ఏడాది తిరక్కుండానే తల్లినీ, తండ్రినీ పోగొట్టుకుంది షీలాదేవి. ఒంటరిగా మిగిలిపోయానని తీవ్రంగా కుంగిపోయింది. కానీ... జీవితం ముందుకు సాగాల్సిందేనని తనకు తానే ధైర్యం చెప్పుకుని, బతుకుదెరువు కోసం కొన్ని గేదెలు కొనుగోలు చేసింది. పాలు విక్రయించడం మొదలుపెట్టింది. సైకిల్‌పైనే చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలకు వెళ్లి పాలు అమ్ముతుంది షీలా.
" ఉదయం నాలుగింటికే నిద్రలేస్తాను. గేదెలకు మేత వేసి, పాలు పితుకుతాను. ఇతరుల నుంచి కూడా పాలు కొనుగోలు చేసి, సైకిల్‌పై వెళ్లి, ఇంటింటికీ పాలు పోసి వస్తాను. నాకు 60 మంది వరకు వినియోగదారులున్నారు. మిగిలిపోయిన పాలను డెయిరీలో ఇస్తాను. ఒంటిగంట నుంచి నాలుగింటి వరకు పని ఉంటుంది. వండుకుని నాలుగు గంటలకు తింటాను. మళ్లీ ఐదింటికి పనికి వెళ్తాను. రోజూ ఏడున్నరకు నా పని పూర్తవుతుంది."
- షీలాదేవి
22 ఏళ్లుగా..
22 ఏళ్లుగా పాలు విక్రయిస్తోంది షీలా. 62 ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం ఆమె సొంతం. ఇంటింటికీ పాలు సరఫరా చేయడమే కాదు.. మార్కెట్లు, దుకాణాలకు కూడా పాలు విక్రయిస్తోంది షీలాదేవి. ఇతర గ్రామాలకు చెందిన రైతుల నుంచీ పాలు కొనుగోలు చేస్తోంది.
" కొందరు వెంటనే డబ్బులిస్తారు. కొందరు నెలవారీగా ఇస్తారు. నేనైతే పాలు అమ్మేవాళ్లకు ముందే డబ్బు చెల్లిస్తాను."
- షీలాదేవి
శీతాకాలమైనా, వేసవికాలమైనా తన దినచర్య మారదని చెప్తోంది షీలా. సైకిల్‌పై పెద్దపెద్ద పాల క్యాన్లను ఎక్కించుకుని, ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమాపూర్‌కు వెళ్తుంది. నాలుగు గంటల తర్వాత మళ్లీ పాలు కొనేందుకు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్తుంది. పశువులకు మేత వేయడం, పాలు పితకడం లాంటి పనులన్నీ స్వయంగా చేసుకుంటుంది.
" నాకు పింఛను రాదు. ఎలాంటి హెల్త్‌కార్డూ లేదు. మొదట్లో వ్యవసాయం ద్వారా 2 వేల రూపాయలైనా వచ్చేది. అది కూడా ఇప్పుడాగిపోయింది. డబ్బు సంపాదించేందుకు నాకు వేరే మార్గం లేక పాల సరఫరా మొదలుపెట్టాను. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ఏదైనా సాయం చేయాల్సిందిగా వేడుకుంటున్నా."
- షీలాదేవి
భర్త, తల్లిదండ్రుల మరణం తర్వాత.. సాయం కోసం షీలా ఎవరివద్దా చేయి చాచలేదు. రెక్కల కష్టాన్నే నమ్ముకుని, తన కాళ్లపై తాను నిలబడగలిగింది. వృత్తి పట్ల గౌరవంతో, కష్టపడి పనిచేసి, ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచింది షీలా.
ఇదీ చూడండి: ఐటీ ఉద్యోగం వీడి.. సేంద్రీయ సాగులోకి..