50ఏళ్లు నిండాయంటే చాలు తమ పని అయిపోయిందనుకుంటారు చాలామంది. అయితే పట్టుదల ఉంటే వయసుతో సంబంధం లేకుండా ఏమైనా సాధించొచ్చని నిరూపించిందో 56 ఏళ్ల మహిళ. ఐదుపదుల వయసులోనూ ఎవరి సాయం లేకుండా నీటి బావులు తవ్విందామే. వక్క సాగుకోసం బావులు తవ్విన ఆమె కృషిని స్థానికులు కొనియాడుతున్నారు. కర్ణాటకలోని గౌరి చంద్రశేఖర్ నాయక్ ఈ ఘనత సాధించింది.
అన్నీ తానై..
గౌరీ చంద్రశేఖర్ నాయక్ ఉత్తర కర్ణాటకలోని షిర్సిపట్టణవాసి. వయస్సు యాభై ఆరేళ్లు. ఈ వయసులోనూ.. అవలీలగా రెండు బావులు తవ్వేశారు. మట్టి తవ్వడం దగ్గర నుంచి, తీయడం వరకూ తానొక్కతే శ్రమించి.. దాదాపు అరవై అడుగుల లోతుండే రెండు బావులను తవ్వారు. ఒక్కొక్క బావి తవ్వేందుకు ఆమెకు పట్టిన సమయం నాలుగు నుంచి ఐదు నెలలు.
ఇదీ చదవండి: మూర్తీభవించిన మానవత్వం.. అనాథ శవాన్ని మోసిన మహిళా ఎస్సై
ఇదీ చదవండి: పోలీసు చొరవ, బైకర్ సాహసంతో బామ్మకు మందులు
వక్క సాగు కోసమే..
గౌరి తన పెరట్లో సాగు చేస్తున్న వక్క చెట్లకు నీరు తక్కువైంది. దీంతో నీటి కోసం బావి తవ్వాలని నిర్ణయించిన ఆమె తన ఇంటి వెనుకన ఉన్న ఖాళీ స్థలంలో ఎవరి సహాయం లేకుండానే రాత్రీపగలు శ్రమించి ఈ బావులు తవ్వారు. లాక్‌డౌన్ సమయం కంటే ముందు ఓ బావి తవ్విన గౌరి లాక్ డౌన్ సమయంలో మరో బావి నిర్మాణాన్ని పూర్తిచేశారు.
ఐదుపదుల వయసులో గౌరి చేసిన ఈ బృహత్తర కార్యక్రమానికి స్థానికులు నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం సైతం ఆమె పట్టుదలను, కృషిని కొనియాడింది.
ఇదీ చదవండి: ఆ ఇల్లు అందమైన చిత్రాలు నిండిన పొదరిల్లు