ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలో పొరపాటున రూ.5 లక్షల 50వేలు డిపాజిట్ అయ్యాయి. అయితే.. అవి ప్రధాని మోదీ జమ చేశారని భావించిన సదరు వ్యక్తి.. ఆ నగదును తిరిగిచ్చేందుకు నిరాకరించాడు. డబ్బును పూర్తిగా ఖర్చు పెట్టానని తెలిపాడు. ఈ ఘటన బిహార్‌లో జరిగింది.
ఏం జరిగిందంటే..?
బిహార్ ఖాగఢియా జిల్లా భక్తియార్‌పుర్ గ్రామానికి చెందిన రంజిత్ దాస్ బ్యాంకు ఖాతాలో.. ఖాగఢియా గ్రామీణ బ్యాంకు నుంచి.. పొరపాటున రూ.5.5 లక్షలు జమయ్యాయి. అయితే.. ప్రధాని మోదీ చెప్పినట్లుగానే తన ఖాతాలో నగదు డిపాజిట్ అయిందని రంజిత్ దాస్ అనుకున్నాడు.
" మార్చిలో తన ఖాతాలో నగదు డిపాజిట్ అయినప్పుడు నేను చాలా సంతోషించా. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ.. చెప్పినట్లుగా నా ఖాతాలో మొదటి విడత కింద నగదు జమైందని భావించాను. డబ్బు మొత్తం ఖర్చు చేశాను. ఇప్పుడు నా ఎకౌంట్లో డబ్బు లేదు." అని రంజిత్ దాస్ చెప్పుకొచ్చాడు. డబ్బును తిరిగిచ్చేయాలని ఇప్పటికే చాలాసార్లు.. బ్యాంకు నుంచి నోటీసులు వచ్చినా.. రంజిత్ దాస్ మాత్రం ఆ డబ్బును ఇచ్చేందుకు నిరాకరించాడు.
బ్యాంకు మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పటికే రంజిత్ దాస్‌ను అరెస్ట్ చేశామని స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి దీపక్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: 'భారత్.. ప్రజాస్వామ్యానికి అమ్మ లాంటిది'