30 People Died in Belagavi : ఒకటి కాదు రెండు కాదు.. నెలన్నర వ్యవధిలోనే ఆ గ్రామంలో 30 మరణాలు!! దాదాపు ప్రతిరోజు ఓ మరణవార్తతో గ్రామస్థులు వణికిపోతున్నారు. అమ్మవారికి ఆగ్రహం వచ్చినందునే ఇలా జరుగుతోందా? మరణాలను ఆపేందుకు గ్రామ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? మరణాల వెనుక ఉన్న రహస్యం ఏంటి? అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతోంది? ఈ విషయంపై వైద్య నిపుణులు ఏం అంటున్నారో తెలుసుకుందాం.
కర్ణాటక బెళగావి జిల్లాలోని తురనూర్ గ్రామంలో వరుసగా మరణాలు సంభవిస్తున్నాయి. 45 రోజుల వ్యవధిలో 30 మంది ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. ఈ మరణాలపై గ్రామస్థులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ రోజు దుర్గాదేవికి పూజలు చేసే సమయంలో విగ్రహం ధ్వంసం కావడమే ఈ మరణాలకు కారణమని గ్రామస్థులు గట్టిగా నమ్ముతున్నారు. ఇలా జరిగిన తరువాత నుంచే మరణాలు సంభవిస్తున్నాయని అంటున్నారు. అందుకే అమ్మవారిని శాంతింపజేయటం కోసం హోమం, అభిషేకాలు చేయాలని నిర్ణయించుకున్నారు.
అమ్మవారికి జాతర.. కుంభమేళా నిర్వహణ!
ప్రతి మంగళవారం ఎలాంటి పనులు చేయకుండా దుర్గాదేవికి పూజలు చేయాలని ఆలయ పూజరి.. గ్రామస్థులకు సూచించారు. అలానే పూజరులు వచ్చినప్పుడు తప్ప మిగిలిన రోజులు గర్భగుడి తలుపులు మూసివేసి ఉంచాలని స్పష్టం చేశారు. పూజరి సూచన మేరకు గ్రామస్థులు గత 15 రోజులుగా అమ్మవారి గర్భగుడి తలుపులు మూసివేశారు. పూజారులు వచ్చినప్పుడు మాత్రమే గర్భగుడి తెరిచి అమ్మవారికి పూజలు చేస్తున్నారు. అలానే నవంబర్ 15న గ్రామంలో జాతరను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని శాంతింపజేయటం కోసం హోమం, కుంభమేళా, పుష్పయాగం నిర్వహించనున్నారు. ఒక గొర్రె పిల్లను అమ్మవారికి బలి ఇవ్వాలని నిర్ణయించారు.
'ఎందుకు చనిపోతున్నారో తెలుసుకుంటాం'
ఈ విషయంపై బెళగావి జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ మహేశ్ కోని స్పందించారు. ఈ మరణాల ఎందుకు సంభవిస్తున్నాయో త్వరలోనే తెలుసుకుంటామని తెలిపారు. అలానే గ్రామంలో అధికారులతో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా చేస్తున్నామని అన్నారు. తానే స్వయంగా తురనూరు గ్రామానికి వెళ్లి తనిఖీ చేస్తామని చెప్పారు. గ్రామస్థులందరూ భయపడకుండా ధైర్యంగా ఉండాలన్నారు.
పాముకాటుతో బాలిక మృతి.. బతికించేందుకు మృతదేహానికి పేడ పూసి, వేప కొమ్మలతో పూజలు..