ఉత్తర్ ప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 3.19 లక్షల మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నాలుగు విడతల్లో జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను యంత్రాంగం ఆదివారం చేపట్టింది.
" పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 3,19,317 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందులో ఏడుగురు జిల్లా పంచాయతీ, 2,005 మంది క్షేత్ర పంచాయత్, 3.17 లక్షలకుపైగా మంది గ్రామ పంచాయతీల్లో గెలుపొందినవారు ఉన్నారు. అలాగే.. 178 మంది అభ్యర్థులు గ్రామ పంచాయతీల ప్రధాన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం బ్యాలెట్లు లెక్కించే వరకు లెక్కింపు కొనసాగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ 2 రోజులు పట్టొచ్చు. "
- రాష్ట్ర ఎన్నికల సంఘం
బాలియా జిల్లాలోని మనియర్ బ్లాక్ రాంపుర్ గ్రామ ప్రధాన్ సీటుకు పోటీ చేసిన శైలేశ్ సింగ్ (45) ఆదివారం ఉదయం మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
కొవిడ్ నిబంధనల మేరకే..
ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన క్రమంలో కొవిడ్ నిబంధనల మేరకు అభ్యర్థులు, వారి ఏజెంట్లను 48 గంటల ముందు కరోనా నెగటివ్ రిపోర్ట్ ఉన్న వారినే అనుమతించినట్లు అధికారులు తెలిపారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఓట్ల లెక్కింపు వాయిదా వేయాలన్న పిటిషన్ ను శనివారం తిరస్కరించింది సుప్రీం కోర్టు. 829 కౌంటింగ్ కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తామని ఎస్ఈసీ హామీ ఇచ్చిన క్రమంలో అనుమతించింది. విజయోత్సవ ర్యాలీలను నిషేధించింది.
పోటీలో లక్షల మంది..
ఉత్తర్ ప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు మొత్తం నాలుగు దశల్లో జరిగాయి. చివరి దశ ఏప్రిల్ 29న పూర్తయింది. మొత్తం 75 శాతం ఓటింగ్ నమోదైంది. పంచాయతీ ఎన్నికల్లో లక్షల మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. గ్రామ పంచాయతీ వార్డులు 7.32 లక్షలు, గ్రామ పంచాయతీల్లో 58,176, క్షేత్ర పంచాయతీల్లో 75,852, జిల్లా పంచాయతీల్లో 3,050 సీట్లకు ఓటింగ్ జరిగింది.
ఇదీ చూడండి: 'ఓట్ల లెక్కింపు వాయిదా వేస్తే ఆకాశం విరిగిపడుతుందా?'