ముస్లిం మతానికి చెందిన వ్యక్తి హిందూ మహిళను రెండో వివాహం చేసుకుంటే అది చెల్లుబాటు కాదని గువాహటి హైకోర్టు తెలిపింది. ప్రత్యేక వివాహ చట్టం-1954 కూడా ఈ పెళ్లిని కాపాడలేదని స్పష్టం చేసింది. ఓ కేసు విచారణలో భాగంగా ఈ మేరకు తీర్పు వెలువరించింది.
అసోం కామ్రూప్ జిల్లాలో నివాసముండే మహిళ దీపమణి కలితకు 12 ఏళ్ల కుమారుడున్నాడు. ఆమె భర్త సహబుద్దిన్ 2017లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. జిల్లా డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో పని చేస్తున్న తన భర్త మరణం అనంతరం పెన్షన్‌తో పాటు ఇతర ప్రయోజనాలు తనకు అందాలని దీపమణి అధికారులను సంప్రదించారు. అందుకు వారు నిరాకరించడం వల్ల 2019లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ పెళ్లి చెల్లదని తెలిపింది. సహబుద్దీన్ మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారనేందుకు ఆధారాలు లేవని పేర్కొంది. మహమ్మదీయ చట్ట సూత్రాల ప్రకారం, ఒక ముస్లిం వ్యక్తి విగ్రహారాధన చేసే మహిళను వివాహం చేసుకోవడం చెల్లదని, అది అక్రమ వివాహమని స్పష్టం చేసింది. పిటిషన్ దాఖలు చేసింది మహమ్మదీయురాలు కాదని చెప్పింది. ప్రత్యేక వివాహం చట్టం-1954 మేరకు పెళ్లి చేసుకున్నామని చెబుతున్నప్పటికీ అందులోని సెక్షన్4(ఏ) ప్రకారం ఈ వివాహం చెల్లుబాటు కాదని వివరించింది. పిటిషనర్ ముస్లిం మతాన్ని స్వీకరించలేదని కూడా గుర్తు చేసింది.
అయితే పిటిషనర్ కుమారుడు మైనర్ అయినందున తండ్రి పెన్షన్ నుంచి అతను భాగం పొందవచ్చని కోర్టు తెలిపింది. అతని పేరున ఓ బ్యాంకు ఖాతా తెరిచి, సంరక్షకురాలిగా తల్లిని పేర్కొనవచ్చని సూచించింది. తండ్రి పెన్షన్‌లో భాగాన్ని మైనర్ కుమారుడికి ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలించాలని అధికారులకు మాత్రం కోర్టు ఆదేశాలు జారీ చేయలేదు.
ఇదీ చదవండి: 'దంపతులిద్దరూ విషం తాగితే భర్తను శిక్షించడం తగదు'