2Kg Foetus In 7 Month Old Boy Stomach : ఏడు నెలల బాలుడి కడుపులో నుంచి ఆరు నెలల వయసు పిండాన్ని విజయవంతంగా తొలగించారు ఉత్తర్ప్రదేశ్ వైద్యులు. దాదాపు రెండు కిలోల బరువున్న పిండాన్ని.. ఆపరేషన్ను చేసి బయటకు తీశారు. వింత సమస్యతో బాధపడుతున్న చిన్నారికి అపాయం తప్పించారు. ప్రయాగ్రాజ్ జిల్లాలోని సరోజినీ నాయుడు చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యులు.. ఈ అరుదైన ఆపరేషన్ చేశారు.
గత కొద్ది రోజులుగా బాధిత బాలుడు ఆనారోగ్యంతో బాధపడుతున్నాడు. కడుపు పరిణామం కూడా రోజురోజుకు పెరుగుతోంది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. శిశువును జిల్లాలోని సరోజినీ నాయుడు చిల్డ్రన్స్ హాస్పిటల్లో చూపించారు. చిన్నారికి వివిధ రకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. బాలుడి కడుపులో మరో పిండాన్ని గుర్తించారు. అనంతరం క్లిష్టమైన ఆపరేషన్ చేసి చిన్నారిని రక్షించారు.
అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా చిన్నారి కడుపులో రెండు కిలోల పిండాన్ని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. ఆ పిండం ఆరు నెలల వయస్సు ఉందని.. చేతులు, పాదాలు, వెంట్రుకలు అభివృద్ది చెందాయని వారు వివరించారు. ఈ అరుదైన పరిస్థితిని ఫీటస్-ఇన్-ఫీటూ అంటారని వారు పేర్కొన్నారు. శిశువుకు విజయంవంతగా ఆపరేషన్ పూర్తి చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం చిన్నారి పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వారు తెలిపారు. కొన్ని రోజుల పాటు బాలుడ్ని తమ పరిశీలనలోనే ఉంచనున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.
ఎందుకిలా? దీని గురించి వైద్యులు ఏమంటున్నారు..
What Is Foetus-In-Foetu : "ఈ శస్త్రచికిత్స చాలా సంక్లిష్టమైనది. అప్రమత్తంగా లేకపోతే కిడ్నీల నుంచి రక్తశ్రావం జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి కేసులు చాలా అరుదు. 10 లక్షల మందిలో ఒకరిలో మాత్రమే ఇలా జరుగుతుంది. 'ఫీటస్ ఇన్ ఫీటు'గా పిలిచే ఈ సమస్య.. గర్భాశయంలో కవలలు వృద్ధి చెందుతున్న దశలో ఏర్పడే వైకల్యం వల్ల కలుగుతుంది. చిన్నారి తల్లి కడుపులో రెండు పిండాలు ఉన్నప్పుడు.. ఓ పిండం పూర్తి స్థాయిలో వృద్ధి చెందదు. అది వృద్ధి చెందిన మరో పిండంలో అలాగే ఉండి చనిపోతుంది. దీంతో ఫీటస్ ఇన్ ఫీటు' సమస్య ఏర్పడుతుంది." అని నిపుణులు చెబుతున్నారు.
11 నెలల అబ్బాయి కడుపులో రెండు కిలోల పిండం..
2Kg Foetus In 11 Month Old Boy Stomach : కొంత కాలం క్రితం పదకొండు నెలల బాబుకు ఈ తరహా శస్త్ర చికిత్సనే చేశారు అసోం వైద్యులు. కడుపులో ఉన్న రెండు కిలోల పిండాన్ని విజయవంతంగా తొలగించారు. పుట్టిన కొన్ని రోజులకే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న చిన్నారిని పరీక్షించిన వైద్యులు.. అనంతరం ఈ ఆపరేషన్ నిర్వహించారు. దిబ్రూగఢ్ జిల్లాలోని అపేక్ష ఆసుపత్రి వైద్యులు ఈ శస్త్ర చికిత్స చేశారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.