దేశంలో ఆక్సిజన్ కొరతతో కరోనా రోగుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత సహా.. ఇతర కారణాలతో 24 గంటల్లోనే 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికిపైగా కరోనా రోగులు ప్రాణవాయువు సమస్యను ఎదుర్కొంటున్నారు.
ఈ అంశంపై సమగ్ర విచారణ జరుపుతున్నామని ఆ రాష్ట్ర మంత్రి సురేశ్ కుమార్ తెలిపారు. మరణాలకు గల కారణాలపై నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు.. చామరాజనగర్ జిల్లా ఆసుపత్రిలో మరణాలపై ముఖ్యమంత్రి యడియూరప్ప విచారం వ్యక్తం చేశారు.
ఈ ఘటనలో 24 మంది ఆక్సిజన్ కొరతతోనే చనిపోలేదని చామరాజనగర్ డిప్యూటీ కమిషనర్ రవి అన్నారు. 'ఒకేరోజులో 24 మంది ప్రాణాలు కోల్పోయారు కానీ అన్ని మరణాలకూ ప్రాణవాయువు కారణం కాదు. ఈ విషయమై ఆడిట్ కొనసాగుతోంది. వాస్తవాలన్నీ ఆ రిపోర్ట్ ద్వారా తెలుస్తాయి. రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. వారికి తగినంత ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ఎలాంటి సమస్య లేదు.' అని పేర్కొన్నారు రవి.
'దోషులపై చర్యలు తీసుకుంటాం'
ఈ విషాద ఘటనకు కారణమైన వారిపై చర్యలు చేపడతామని జిల్లా ఇన్ఛార్జి, మంత్రి సురేశ్ కుమార్ తెలిపారు.
"ఆదివారం రాత్రి ఆ ఆస్పత్రిలో ప్రాణవాయువు కొరత ఏర్పడింది. కానీ, అన్ని మృతులకూ ఆక్సిజన్ కారణం కాదు. దోషులపై చర్యలు తీసుకోవడం సహా.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్కుంటాం. ఈ ఆస్పత్రికి తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేయాలని పై అధికారులతో మాట్లాడాను. దీనిపై మేము ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటుచేస్తాం."
- సురేశ్ కుమార్, కర్ణాటక మంత్రి
రెండు రోజుల్లో రెండో ఘటన..
ఆ రాష్ట్రంలో రెండు రోజుల్లోనే ఇది రెండో ఘటన కావడం గమనార్హం. అంతకముందు(శనివారం).. కాలబురగిలోని కేబీఎన్ ఆస్పత్రిలోనూ ఆక్సిజన్ కొరతతో నలుగురు కొవిడ్ రోగులు మరణించారు.
ఇదీ చదవండి: 'అత్యవసర ఆక్సిజన్ నిల్వల కోసం ఏర్పాట్లు చేయండి'