కూలీకి వెళ్తే కానీ రెండు పూటల తిండి తినలేరు. ఎండ ఉన్నా... వానా ఉన్నా... ఏ కాలమైనా పనికి వెళ్లాల్సిందే. అలా రోజూలానే ఉదయం కూలీలంతా పనికి వెళ్లారు. మిర్చికోతకు వెళ్లిన రైతు కూలీలకు దాహం వేసిందని మోటారు వద్ద నీళ్లు తాగారు. అంతే ఆకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. అసలు ఏం జరిగిందంటే...
ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఉప్పెడు గ్రామంలో 24 మంది కూలీలు అస్వస్థతకు గురయ్యారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నారు. రోజూలానే వీరంతా మిర్చికోతకు వెళ్లారు. అసలే ఎండాకాలం.. అందులో దాహం వేయడం సహజం. మధ్యాహ్నం రోజూలానే భోజనం చేశారు. అయితే నీళ్లు తాగేందుకు పక్క రైతు పొలానికి వెళ్లి మోటారు వద్ద నీటిని పట్టుకుని తాగారు. వారంతా తాగారు. ఏమైందో తెలియదు ఒక్కసారిగా వారికి ఒక్కసారిగా వాంతులు అయ్యాయి. నాలుక తిమ్మిరిగా ఉండటం, కళ్లు తిరగడంతో ఆందోళన చెందారు.
అసలు ఏం జరిగిందో... మిగిలిన కూలీలు ఆరాతీశారు. ఆ పక్క పొలం రైతు పొలంలోని డ్రిప్ పైపులను శుభ్రపరిచేందుకు పాస్ఫరిక్ యాసిడ్ అనే రసాయన మందును ఉపయోగించారని తెలుసుకున్నారు. ఆ పైపుల నుంచే నీరు విడిచిపెట్టినట్లు తేలింది. గమనించిన స్థానికులు హుటాహుటిన వారిని వెంకటాపురం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్సను అందించారు. కానీ అందులో ముగ్గురు కూలీల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అయితే నీళ్లు తాగితే అస్వస్థతకు గురికావడం ఏంటా అని అందరూ అనుకున్నారు. అయితే వాళ్లు పురుగుల మందు కలిసిన నీరు తాగడంతోనే వాంతులైనట్లు వైద్యులు తెలిపారు. అస్వస్థతకు గురైన కూలీలందరికీ సామాజిక ఆసుపత్రిలోనే సేవలందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చూడండి: