దిల్లీలోని శరద్ పవార్(Sharad Pawar) నివాసంలో రాష్ట్ర మంచ్(జాతీయ సమాఖ్య) భేటీ అయ్యింది. దేశంలోని వివిధ ప్రతిపక్షాలకు చెందిన 15మంది నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా, పవార్ దీనికి నేతృత్వం వహిస్తున్నారు.
ఈ భేటీలో పాల్గొన్న వారిలో సమాజ్ వాదీ పార్టీ నేత ఘన్‌శ్యామ్ తివారీ, ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరి, ఆప్ నాయకుడు సుశీల్ గుప్తా, సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం పాల్గొన్నారు. సీపీఎం నేత నీలోత్పాల్ బసు ఉన్నారు.
నేషనల్ కాన్ఫరెన్స్ నాయకులు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ మాజీ నేత సంజయ్ ఝా, జేడీయు మాజీ నేత పవన్ వర్మా కూడా సమావేశానికి హాజరయ్యారు. భేటీలో పాల్గొన్న ఇతర ప్రముఖుల్లో జస్టిస్ ఏపీ షా, జావెద్ అక్తర్, కేసీ సింగ్ ఉన్నారు.
ప్రధాని మోదీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా టీఎంసీ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా రాష్ట్ర మంచ్‌ను 2018లో ఏర్పాటు చేశారు. కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తడమే దీని ప్రధాన ఉద్దేశం. ఇది రాజకీయ వేదిక కాదు. దేశంలో రాజకీయ, సామాజిక ఆర్థిక పరిస్థితులపై చర్చిస్తారు. ఈ సమావేశానికి పవార్ తొలిసారి హాజరయ్యారు.
పవార్ కీలకం
కేంద్రంలో భాజపాకు వ్యతిరేక కూటమి ఏర్పాటులో పవారే కీలక నేతగా భావిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏకు దీటుగా బలమైన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. తన వ్యూహాలతో బంగాల్లో టీఎంసీకి తిరుగులేని విజయాన్ని అందించిన ప్రశాంత్ కిశోర్‌తో పవార్ రెండు సార్లు భేటీ అయిన తర్వాత రాష్ట్ర మంచ్ సమావేశం జరగుతుండటం ఆసక్తికరంగా మారింది.
ఎన్సీపీ భేటీ..
అంతకు ముందు పవార్ నివాసంలోనే ఆయన అధ్యక్షతన ఎన్సీపీ జాతీయ కార్యనిర్వాహక సమావేశం జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యచరణ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ పాత్ర ఎలా ఉంటుంది అనే విషయాలపై రెండు గంటల పాటు చర్చించారు. ఈ భేటిలో ఎన్సీపీ కీలక నేతలు సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కరే పాల్గొన్నారు.