అత్యాచారానికి గురైన 12 ఏళ్ల బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బాలికతో పాటు శిశువు ఆరోగ్యం క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలిపై గతంలో ఇద్దరు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు. అందువల్లే ఆమె గర్భం దాల్చినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన రాజస్థాన్ జోధ్‌పుర్ జిల్లాలోని ఓ గ్రామంలో వెలుగుచూసింది.
ఇదీ జరిగింది
జిల్లాలోని బలేసర్ సబ్‌డివిజన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తీవ్ర కడుపునొప్పితో బాధపడగా.. ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. అక్కడే బాధితురాలు గర్భవతి అని, పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు నిర్ధరించారు. దీంతో వెంటనే అబార్షన్ చేయాలని వైద్యులను కోరారు బాలిక తల్లిదండ్రులు. అయితే పరిస్థితి క్లిష్టంగా ఉందని గుర్తించిన స్థానిక వైద్య సిబ్బంది.. జోధ్‌పుర్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. అలాగే పోలీసులకు కూడా సమాచారం అందించారు.
'ఇద్దరు అత్యాచారం చేశారు'
పాఠశాలలో ఇద్దరు అబ్బాయిలు తనను అత్యాచారం చేసినట్లు పోలీసులు, వైద్యులకు బాలిక చెప్పినట్లు రాజస్థాన్ పిల్లల సంక్షేమ కమిటీ(సీడబ్ల్యూసీ) అధ్యక్షుడు ధన్పత్ గుర్జార్ తెలిపారు. బాలిక తల్లిదండ్రులను కలిసిన అధికారులు.. అన్ని విధాల వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బాలిక చెప్పిన వివరాలతో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చూడండి: పుట్టినరోజు వేడుకల్లో పేలిన తుపాకీ.. చివరికి!