స్పైస్‌జెట్ సంస్థకు చెందిన బోయింగ్ బి737 విమానమొకటి వాతావరణ మార్పుల కారణంగా ఆదివారం గాల్లో భారీగా కుదుపులకు (టర్బలెన్స్) లోనైంది. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
ముంబయి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపుర్ నగరానికి చేరుకున్న విమానం ల్యాండ్ అవడానికి ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై స్పైస్‌జెట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించినట్లు సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న డీజీసీఏ.. దర్యాప్తు ప్రారంభించింది.