మదర్సాలో విద్యార్థుల పట్ల దారుణంగా ప్రవర్తించాడు ఓ ఉపాధ్యాయుడు. విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టి భయాందోళనకు గురిచేశాడు. ఈ ఘటన తమిళనాడు.. చెన్నైలో జరిగింది. ఈ కేసులో మదర్సా నడుపుతున్న అక్తర్, ఉపాధ్యాయుడు అబ్దుల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మాధవరం ప్రాంతంలో ఓ మదర్సా ఉంది. ఈ మదర్సాలో బిహార్‌కు చెందిన అబ్దుల్లా(20) అనే యువకుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మదర్సాలో అదే రాష్ట్రానికి చెందిన పది నుంచి 12 ఏళ్ల వయసున్న 12 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఈ పాఠశాల నుంచి చిన్నారుల అరుపులు వినిపిస్తున్నాయని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు మదర్సాకు వెళ్లి పరిశీలించగా.. విద్యార్థులు భయంతో వణికిపోయారు. వారి ముఖం, చేతులు, కాళ్లు, చేతులు, వీపు భాగంపై గాయాల మచ్చలు ఉన్నాయి. చిన్నారులకు ప్రాథమిక చికిత్స చేయించిన అనంతరం ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
ఇస్లామిక్ విద్యను అభ్యసించేందుకు 12 మంది చిన్నారులు బిహార్ నుంచి వచ్చారు. వారి తల్లిదండ్రులు మదర్సాకు నెలవారీగా ఫీజులు కడుతున్నారు. ఉపాధ్యాయుడు చెప్పిన పాఠాలు అర్థం కాలేదని విద్యార్థులు అడిగినా, సరిగ్గా చదవకపోయినా తీవ్రంగా కొట్టేవాడు. కర్రలు, ఇనుప తీగలతో వారిపై దాడి చేసేవాడు. విద్యార్థులను మదర్సా నుంచి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాం. చిన్నారులను బిహార్ పంపేందుకు ఏర్పాటు చేస్తున్నాం.
--పోలీసులు