ఉత్తరాఖండ్లో ఓ ఆశ్చర్యకర ఘటన జరిగింది. చనిపోయిందని అనుకున్న 109 ఏళ్ల బామ్మ లేచి కూర్చొంది. దాదాపు 7 గంటల తర్వాత బామ్మ లేచి కూర్చొవడం వల్ల ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు. అంతేకాకుండా లేచిన వెంటనే తనకి చాట్ తినాలనిపిస్తుందని అడిగి మరీ తెప్పించుకొని ఆరగించింది వృద్ధురాలు.
వివరాల్లోకి వెళ్తే.. హరిద్వార్ జిల్లాలోని రూర్కీ ప్రాంతం నర్సన్ ఖుర్ద్ గ్రామానికి చెందిన జ్ఞాన్ దేవీ అనే వృద్ధురాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో చికిత్స కోసం ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. వృద్ధాప్యం కారణంగా చికిత్సకు వృద్ధురాలి శరీరం సహకరించలేదు. దీంతో ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో శ్మశానవాటికకు తీసుకెళ్లే కొన్ని నిమిషాల ముందు వృద్ధురాలి శరీరంలో చలనాన్ని గమనించారు బంధువులు. వెంటనే అక్కడున్న వారు ఆమెను కదిలించారు. ఇంతలో ఆమె కళ్లు తెరవడం వల్ల అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
కళ్లు తెరిచిన బామ్మను అక్కడున్నవారు ఏమైనా తినాలనుకుంటున్నావా..? రసుగుల్లా తింటావా అని అడిగారు. దీంతో తనకు చాట్ తినాలనిపిస్తుందని చెప్పింది బామ్మ. చాట్ తిన్నాక వృద్ధురాలు హుందాగా లేచి కూర్చొంది. బామ్మ బతికినందుకు ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.