100 Websites Blocked In India : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు వ్యవస్థీకృత అక్రమ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్న 100కి పైగా అనధికారిక వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో టాస్క్ ఆధారిత పార్ట్‌టైమ్ జాబ్ మోసాలకు పాల్పడుతున్న వెబ్సైట్లు కూడా ఉన్నాయి. కాగా, ఈ వెబ్‌సైట్‌లను విదేశాలకు చెందినవారు నిర్వహిస్తున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ తన వర్టికల్ నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (ఎన్సీటీఏయూ) ద్వారా వ్యవస్థీకృత పెట్టుబడులతో పాటు టాస్క్ ఆధారిత పార్ట్ టైమ్ జాబ్ మోసాలకు పాల్పడుతున్న 100కిపైగా వెబ్‌సైట్‌లను గతవారం గుర్తించింది. ఈ మేరకు వాటిని బ్లాక్ చేయాలని హోం శాఖకు సిఫార్సు చేసింది. ఐటీ చట్టం-2000 ప్రకారం సదరు వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసినట్లు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆర్థిక నేరాలకు సంబంధించిన వ్యవస్థీకృత అక్రమ పెట్టుబడులను ఈ వెబ్సైట్లు సులభతరం చేస్తున్నాయని.. వీటిని విదేశాల్లో ఉండి నిర్వహిస్తున్నారని కేంద్రం తెలిపింది. ఇందుకోసం వీరు డిజిటల్ ప్రకటనలు, చాట్ మెసెంజర్‌లు, అద్దె ఖాతాల వంటి వాటిని ఉపయోగిస్తున్నారని ఐటీ శాఖ గుర్తించింది. కార్డ్ నెట్‌వర్క్, క్రిప్టో కరెన్సీ, విదేశీ ఏటీఎం ఉపసంహరణలు, అంతర్జాతీయ ఫిన్‌టెక్ కంపెనీల సాయంతో పెద్ద ఎత్తున ఆర్థిక మోసాలకు పాల్పడి వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని భారతదేశం నుంచి మనీ లాండరింగ్ చేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
"ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న ఈ వెబ్సైట్లపై 1930 హెల్ప్‌లైన్ ద్వారా మాకు అనేక ఫిర్యాదులు అందాయి. వీటితో పౌరులకు పెద్ద ప్రమాదం పొంచి ఉందని అర్థమయింది. అలాగే యూజర్ డేటా భద్రతకు సంబంధించిన చాలా సమస్యలను మేము కనుగొన్నాము."
- హోం మంత్రిత్వ శాఖ
వారే లక్ష్యంగా..
ఈ రకమైన మోసాలు సాధారణంగా, గూగుల్, మెటాకు చెందిన ప్లాట్‌ఫామ్‌లలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఇంట్లోనే ఉండి సంపాదించడం ఎలా అంటూ మోసం చేస్తున్నారని కేంద్ర హోం శాఖ చెప్పింది. విదేశాలకు చెందిన వైబ్‌సైట్ నిర్వాహకులు వీటిని ఇతర భాషల్లోకి కూడా మార్చి టార్గెటెడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రకటనలు ఇస్తున్నారని తెలిపింది. ముఖ్యంగా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, మహిళలు, నిరుద్యోగ యువతే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు ఈ మోసాలకు పాల్డడుతున్నారని హోం శాఖ అధికారులు పేర్కొన్నారు.
'డిసెంబర్ 13కు ముందు భారత పార్లమెంట్‌పై దాడి చేస్తా'- ఖలిస్థానీ ఉగ్రవాది హెచ్చరిక
వికీపీడియాలో ఇండియన్ పేజీల హవా! సినిమాలు, క్రికెట్‌పై ఇంట్రెస్ట్- ఎక్కువ వ్యూస్ మాత్రం దానికే!