సాధారణంగా బైక్‌పై ఎంత మంది ప్రయాణిస్తారు?.. ఇద్దరు లేదా ముగ్గురు. కానీ, ఇక్కడ కనిపిస్తున్న ఈ జంబో బైక్ పైన మాత్రం ఒకేసారి పది మంది కూర్చొని ప్రయాణించవచ్చు. అది కూడా పెట్రోల్ ఖర్చు లేకుండానే. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది మాత్రం నిజం. ఈ పది సీట్ల ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేసింది.. ఏదో దిగ్గజ కంపెనీ అనుకుంటే పొరపాటే. వృత్తి రీత్యా ప్లవర్ డెకరేటర్ అయిన ఓ కుర్రాడు తయారుచేశాడు.
బంగాల్లోని దుర్గాపుర్ ప్రాంతానికి చెందిన ఛోటన్ ఘోష్ అనే యువకుడు పర్యావరణహితంగా నడిచే ఈ మెగాసైజ్ ఈ-బైక్‌ను తయారుచేశాడు. దీనిపై తన స్నేహితుల్ని కూర్చేబెట్టుకుని రోడ్లపై చక్కర్లు కొడుతున్నాడు. తనకు వచ్చిన చిన్న ఆలోచనకే ప్రాణం పోసి రూపొందించాడు. 22 రోజుల పాటు కష్టపడి.. కేవలం రూ.15వేల వ్యయంతోనే ఛోటన్ తయారుచేశాడు. ఈ జంబో ఈ-బైక్ తయారీ కోసం పాత కారు సామాగ్రి, ఇనుప పైపులనే ఉపయోగించడం విశేషం. ప్రస్తుతం దీన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు ఎగబడుతున్నారు.
"రెండేళ్ల క్రితమే ఇదే తరహాలో ఓ మోటర్ బైక్‌ను తయారుచేశాను. కానీ దాన్ని రోడ్లపైకి తీసుకువచ్చినప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. దానికి ప్రత్యామ్నాయమే ఈ బ్యాటరీ బైక్. సోలార్ ఎనర్జీ, విద్యుత్ ఛార్జింగ్‌తో ఈ బైక్ నడుస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపుగా 100 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. కిలోమీటరుకు కేవలం రూ. 8 మాత్రమే ఖర్చవుతుంది. దీనిలో బ్లూటూత్ సాయంతో పనిచేసే మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. ఈ తరహా కారును తయారు చేయడానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహాయం కోరాను."
-- ఛోటన్ ఘోష్, 10 సీట్ల బైక్ సృష్టికర్త
ఈ మెగాబైక్ను తయారుచేయడానికి కుటుంబసభ్యులు, స్నేహితులు ఎంతగానో సహాయం చేశారని ఛోటన్ తెలిపాడు. ఈ జంబోబైక్ గురించి తెలుసుకున్న అందరూ ఛోటన్ను అభినందిస్తున్నారు. దీంతో ఛోటన్ ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామాల్లో ఫేమస్ అయ్యాడు.
ఇవీ చదవండి:
నదిలో చిక్కుకున్న 'గంగా విలాస్' క్రూయిజ్ షిప్!.. మోటర్ బోట్ల ద్వారా ఒడ్డుకు పర్యటకులు!!