YSRCP Leaders Attack: ఆగడాలకు అడ్డేదీ..? సామాన్యుడి స్థలంపై వైసీపీ నేతల కన్ను.. ప్రశ్నించినందుకు దాడి
YSRCP Leaders Attack: ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జాలకు పాల్పడడం.. అడ్డొచ్చిన, ప్రశ్నించిన వారిపై దాడి చేయడం వంటి ఘటనలు రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయి. వైసీపీ నేతల ఆగడాలు, సామాన్యులపై దాడులు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. నిత్యం అనేక మంది బాధితులు.. తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. దీనిపై ఇప్పటికే అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నప్పటికీ.. ఇటువంటి ఘటనలు తగ్గడం లేదు. కర్నూలు జిల్లా పత్తికొండలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. ఓ స్థలం విషయంలో సుంకన్న అనే వ్యక్తిపై స్థానిక వైసీపీ నేతలు దాడి చేశారు. వైసీపీ నేతలు సాబ్దిన్ నూర్ బాషా.. అతని తమ్ముడు మహబూబ్ బాషాలు దాడి చేశారు. ఈ స్థలం తమదేనంటూ అక్రమించుకునేందుకు యత్నించారు. అడ్డొచ్చిన వారిపై దాడికి పాల్పడ్డారు. స్థలాన్ని కాపాడాలని, వైసీపీ నాయకుల నుంచి తమకు రక్షణ కల్పించాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.