Protest against YSRCP MLA దండాలు పెడుతూ ఓట్ల కోసం వచ్చారా?.. వైసీపీ ఎమ్మెల్యేకి నిరసన సెగ - Gadapa Gadapaku Mana Prabutwam program Updates
🎬 Watch Now: Feature Video
YCP MLA Raghurami Reddyki Nirasana Sega: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన 'గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష' కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, ప్రజాప్రతినిధులకు నిరసన సెగలు తప్పటంలేదు. గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాకే ఊర్లోకి అడుగుపెట్టాలంటూ జనాలు నిలదీస్తున్నారు. దీంతో గ్రామస్థుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకు నాయకులు వెనుదిరుగుతున్నారు. తాజాగా వైయస్‌ఆర్ జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి ప్రజల నుంచి నిరసన సెగ తగిలింది. సమస్యలపై ఏకరవు పెట్టడంతో.. ఒక దశలో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఓ వ్యక్తిని తోసి, ముందుకు కదిలారు.
సమస్యలు పరిష్కరికుండానే ఓట్లు వేయాలా..?.. వైయస్‌ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠం పరిధిలోని నరసన్నపల్లెలో ఈరోజు 'గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష' కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, సర్పంచ్, వార్డుమెంబర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న తాగునీటి సమస్య, రోడ్ల సమస్యలపై మహిళలు ఎమ్మెల్యేని నిలదీశారు. ' సర్పంచిగా గెలిచి రెండేళ్లైనా గ్రామంలో ఉన్న సమస్యను నీవు (సర్పంచి) పట్టించుకోలేదు, ఎంపీపీ పట్టించుకోలేదు, ఆఖరికీ ఎమ్మెల్యే కూడా పట్టించుకోలేదు.' అంటూ నరసన్నపల్లె వాసి ప్రశ్నిస్తుండగా.. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఆ వ్యక్తిని తోసేసి, ముందుకు కదిలారు. అనంతరం బసవాపురంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పోలేరమ్మ నగర్ వాసులు.. తాగునీటి విషయమై ఎమ్మెల్యేని నిలదీశారు. దీంతో త్వరలోనే వేస్తామంటూ.. ఎంపీపీ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయగా.. ఇంకెప్పుడూ వేస్తారంటూ ప్రశ్నించారు. ఓట్ల సమయం దగ్గర పడుతుండడంతో దండాలు పెడుతూ..మళ్లీ ఓట్లు అడగడానికి వచ్చారా..? అంటూ మహిళలు ఆగ్రహించారు.