అంబాపురంలో ఆధిపత్య పోరు - సర్పంచ్‌పై దాడి - about YCP activist attack on Sarpanch
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 25, 2023, 10:59 PM IST
YCP leader attack on Sarpanch: అధికార పార్టీలో అధిపత్య పోరు రగులుతోంది. విజయవాడ రూరల్ అంబాపురంలో నడిరోడ్డుపై కర్రతో కోట్లాటకు అధిపత్య పోరే కారణమని తెలుస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు విజయవాడ రూరల్ అంబాపురం పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన బెంజిమెన్పై గండికొట సీతయ్య స్వతంత్రంగా పోటీ చేసి గెలుపొందాడు. వీరు ఇద్దరు ఎమ్మెల్యే వంశీ అనుచరులే కావడంతో అనంతరం సీతయ్యతో పాటు బెంజిమెన్ కూడా అధికార పార్టీలో ఎమ్మెల్యే వంశీ మద్దతుదారుడుగానే కొనసాగుతున్నాడు.
రౌడీ రాజకీయం అనే నాటక ప్రదర్శన: గత కొంతకాలంగా సీతయ్య, బెంజిమెన్ మధ్య వర్గ పోరు నడుస్తోంది. గ్రామంలోని మట్టి తవ్వకల్లో సైతం ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో పాటు గ్రామంలోని రూ.కోట్ల విలువ చేసే కామన్ సైట్ల వ్యవహరంలో నకిలి పత్రాలు స్పష్టించి ఆక్రమించాలని బెంజిమెన్ ప్రయత్నించడంతో సీతయ్య అడ్డుకుని, అధికారులతో పాటు ఎమ్మెల్యే వంశీకి సైతం ఫిర్యాదు చేశారని గ్రామస్థులు తెలిపారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు మరింతగా పెరిగాయి. తాజాగా క్రిస్మస్ సందర్భంగా నిర్వహించే పౌరణిక నాటకం విషయంలో బెంజిమెన్పై గండికొట సీతయ్యల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అంబాపురంలో క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఏడాది సామాజిక నాటకాలు వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా రౌడీ రాజకీయం అనే నాటక ప్రదర్శనకు స్థానిక సీఎస్ఐ చర్చి ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు.
సీతయ్య ఫోన్ చేసి నాటకాన్ని ఆపించారని: సోమవారం మధ్యాహ్నం టూటౌన్ పోలీసులు అంబాపురం వచ్చి నాటకానికి ఎటువంటి అనుమతులు లేవని నాటకం నిర్వహించేందుకు వీలు లేదంటూ నాటక నిర్వాహకులు బెంజిమెన్, నల్లమోతు చంద్రశేఖర్‌ను బైండోవర్ చేశారు. పోలీసులకు సర్పంచ్ సీతయ్య ఫోన్ చేసి నాటకాన్ని ఆపించారని బెంజిమెన్ తన అనుచరులకు తెలిపారు. దీంతో సాయంత్రం 4.45 గంటల సమయంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న సర్పంచ్ సీతయ్య వద్దకు బెంజిమెన్, చంద్రశేఖర్ లు వెళ్లి 'నీవు పోలీసులకు ఫోన్ చేసి ఎందుకు చెప్పవు, నీ వల్లే నాటకం ఆగింది' అంటూ బూతులు తిడుతూ పెద్ద కర్రతో కాలిపై కొట్టి, తలపై కొట్టిందుకు ప్రయత్నించగా పక్కకు తప్పుకోవడంతో బుజంపై తగిలింది. ఈలోపు స్థానికులు చేరుకుని అడ్డుకున్నారు. ఈ సంఘటనను కొంతమంది సెల్ఫోన్లో వీడియో తీస్తుండగా బెంజిమెన్ 'తీయ్యరా వీడియో తీసుకొని ఏం చేస్తావు' అని బెదిరించాడు. దీంతో గ్రామంలో భయందోళన నెలకొంది. దీనిపై సర్పంచ్ సీతయ్య టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీతయ్యకు భుజంపై తీవ్ర గాయమవ్వడంతో ఆయనను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన నిందితులపై సెక్షన్ 324, 341 రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.