తెలుగు యువత అధికార ప్రతినిధిపై వైసీపీ అనుచరుల దాడి - ఖండించిన లోకేశ్
🎬 Watch Now: Feature Video
YCP Followers Attack on Telugu Yuvatha Leader: వైసీసీ నేతల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ప్రతిపక్ష నేతలు, సానుభూతిపరులపై దారుణంగా దాడులకు తెగబడుతున్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో తెలుగు యువత అధికార ప్రతినిధి విజయ్ గోపాల్‌పై వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. బనగానపల్లె నియోజకవర్గంలో అధికార పార్టీ అక్రమాలను వెలికితీస్తుండటం, టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండటంతో.. విజయ్ గోపాల్‌ను వైసీపీ నేతలు లక్ష్యంగా చేసుకున్నారు.
కొలిమిగుండ్లలో ఇంట్లో ఉన్న అతడిని బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అనుచరుడు నాగేశ్వరరావు సహా కొందరు మహిళలు బయటకు తీసుకువచ్చి దాడికి తెగబడ్డారు. కాలర్ పట్టుకుని రోడ్డుపై నడిపించుకుంటూ.. చెప్పులతో కొడుతూ.. పిడి గుద్దులు కురిపించారు. సుమారు కిలోమీటరు దూరం నడిపించి.. పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని బాధితుడిపైనే ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న బనగానపల్లి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. విజయ్ కుమార్‌ను పరామర్శించి.. తనకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
Nara Lokesh on TDP Vijay Kumar Attack: ఈ దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. విజయ్ కుమార్‌ను చెప్పులతో కొట్టిన ప్రతి ఒక్క వైసీపీ సైకోని అవే చెప్పులతో ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. పాలక పార్టీ ఫ్యాక్షనిస్టుల కంటే ఘోరంగా దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. బాధితులపై రివర్స్ కేసులు బనాయించడం సిగ్గుచేటని లోకేశ్ దుయ్యబట్టారు.