YCP Activist Kidnapped and Attacked in YSR District: వైసీపీ కార్యకర్తను కిడ్నాప్ చేసి.. దాడి చేసి.. వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు - YSR distric Ysrcp workers news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 30, 2023, 9:00 PM IST
YCP worker was kidnapped and Attacked In YSR District: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన వైయస్సార్ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి, తీవ్రంగా దాడి చేశారు. స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు.. వాహనంలోనే అరగంట పాటు బాధితుడిని చితకబాది.. ఏ చోట కిడ్నాప్ చేశారో, మళ్లీ ఆ ప్రాంతంలోనే వదిలిపెట్టి వెళ్లారు.
వివరాల్లోకి వెళ్తే.. వైఎస్ఆర్ జిల్లా ఎర్రగుంట్ల మండలం మాలేపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త శ్రీనివాస్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి, దాడి చేశారు. ప్రొద్దుటూరు నుంచి మాలెపాడుకు ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఎదురుగా స్కార్పియో వాహనంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కిడ్నాప్ చేసి.. వాహనంలోనే అరగంట పాటు చితకబాదారు. అయితే, ఈ ఘటనపై తాను పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయనని, రాజకీయంగా గిట్టకపోవడంతోనే ఇలాంటివి చేస్తుంటారని బాధితుడు తెలిపారు. గత కొంతకాలంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి, వైసీపీ నాయకుడు గంగవరం శేఖర్ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి. బాధితుడు శ్రీనివాస్ రెడ్డి గంగవరం శేఖర్ రెడ్డికి అనుచరుడుగా ఉన్నాడు. ఆ కోపంతోనే ఎమ్మెల్యే అనుచరులు ఈ దాడికి పాల్పడి ఉంటారని బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.