Vande Bharat Express: రాష్ట్రానికి మరో వందేభారత్ రైలు.. విజయవాడ - చెన్నై మధ్య పరుగులు - వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించనున్న ప్రధాని
🎬 Watch Now: Feature Video

Vijayawada To Chennai Vande Bharat Express : రాష్ట్రంలో మరో వందేభారత్ రైలు అందుబాటులోకి రానుంది.. విజయవాడ-చెన్నై మధ్య రాకపోకలు ఈ నెల 7 నుంచి మొదలు కానున్నాయి. ప్రధాని నరంద్ర మోదీ దేశ వ్యాప్తంగా అయిదు వందేభారత్ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. అందులో విజయవాడ-చెన్నై మధ్య నడిచే రైలు కూడా ఉంటుందని విజయవాడ డివిజన్ రైల్వే అధికారులకు సమాచారం అందింది. ఇప్పటికే సంబంధిత అధికారులు ప్రారంభోత్సవ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ వందేభారత్ రైలు 8 వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో రాకపోకలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
విజయవాడ నుంచి చెన్నై మధ్య ఏయే స్టేషన్లలో రైలు ఆగుతుందో తెలియజేయడంతో పాటు రాకపోకల షెడ్యూల్, టిక్కెట్ ధరలు మొదలైన వివరాలు ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. విజయవాడ-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, వందేభారత్‌ను రేణిగుంట మీదగా నడపాలని విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు కోరినట్లు తెలుస్తోంది. ఆ ప్రకారం విజయవాడ నుంచి గూడూరు, రేణిగుంట, కాట్పాడి మీదగా చెన్నై వెళ్లి అదే మార్గంలో తిరిగి రానుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్న విషయం అందరికి తెలిసిందే. మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి వస్తుందని తెలియడంతో ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందేభారత్ రైలు పరుగులు పెడుతుంది. విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ‌్య కూడా మరో రైలు నడుస్తోంది.