బద్వేల్లో దారుణం - చిన్న గొడవలో అన్నదమ్ముల హత్య - యువకుల హత్య
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 4, 2024, 5:37 PM IST
Two Brothers Murder in Badvel: జంట హత్యలతో వైఎస్సార్ జిల్లా బద్వేలు ఉలిక్కిపడింది. చిన్న గొడవ అన్నదమ్ముల హత్యకు దారి తీసింది. పసుపులేటి ప్రశాంత్, సాయికుమార్ కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31 రాత్రి విజయ్ భాస్కర్‌తో గొడవ పడ్డారు. ఇది మనసులో పెట్టుకున్న విజయ్ భాస్కర్ కుమారులు తరుణ్ తేజ్, ప్రమోద్ కుమార్ ఇవాళ ఉదయం ప్రశాంత్, సాయికుమార్‌తో ఘర్షణకు దిగారు. ఈరోజు ఉదయం మరోసారి వీరి మధ్య ఘర్షణ జరిగింది. భాస్కర్ తన ఇద్దరు కుమారులతో పాటు మరో ఇద్దరు కలిసి ప్రశాంత్, సాయికుమార్‌పై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో అన్నదమ్ములిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. కుమారుల మృతితో తల్లిదండ్రులు గుండెలుపగిలేలా రోదిస్తున్నారు. కళ్ల ముందే తన కుమారులను నిర్దాక్షిణ్యంగా చంపుతున్నా ఏం చేయలేకపోయానని తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు మృతదేహాలను బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయ్ భాస్కర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, మద్యం విషయంలో ఇరువురి మధ్య గొడవలు జరిగి హత్యకు దారి తీసి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.