TTD Chairman Inspected Devotees Rush in Tirumala: 'భక్తుల భద్రతే ముఖ్యం'... క్యూలైన్లలో రద్దీని పరిశీలించిన టీటీడీ ఛైర్మన్ - తిరుమలలో భక్తుల రద్దీ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 2, 2023, 3:58 PM IST
TTD Chairman Inspected Devotees Rush in Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి సామాన్య భక్తుల క్యూలైన్లను పరిశీలించారు. భక్తులకు ఆహారం, తాగునీరు, కాఫీ, టీ, మజ్జిగ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి చిన్న ఇబ్బంది కలగకుండా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. గోగర్భం కూడలి నుంచి కృష్ణతేజ కూడలి వరకు క్యూ లైన్లను పరిశీలించిన ఆయన.. పెరటాసి మాసం, సెలవుల కారణంగా గత నాలుగు రోజులుగా తిరుమలలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందన్నారు.
క్యూ లైన్లు 4 నుంచి 5 కిలో మీటర్ల దూరం వెళ్లాయని, భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శనం చేయించాలనే సంకల్పంతో వీఐపీ బ్రేక్, సుపథం, స్లాటెడ్ దర్శనం టోకెన్ల జారీ కూడా రద్దు చేసినట్లు ఛైర్మన్ చెప్పారు. రద్దీ అధికంగా ఉన్నా తితిదే అధికారులు, సిబ్బంది బాగా పనిచేశారని తితిదే ఛైర్మన్ తెలిపారు. అదే విధంగా అలిపిరి నుంచి తిరుమలకు నడచి వచ్చే మార్గంలో వన్య మృగాల నుంచి ఎలాంటి ముప్పు లేదని.. అటవీ శాఖ అధికారులు ధ్రువీకరిస్తేనే 12 ఏళ్ల లోపు పిల్లల విషయంలో ఆంక్షలు సడలిస్తామని స్పష్టం చేశారు. భక్తుల భద్రతే తమకు ముఖ్యమని ఆయన చెప్పారు.