టీడీపీ నేతలపై బలవంతంగా కేసులు పెట్టించారు.. సోషల్ మీడియాలో వైసీపీ నేత ఆడియో వైరల్ - ap viral news
🎬 Watch Now: Feature Video
YCP ACTIVIST AUDIO VIRAL : రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకో సంవత్సరం సమయం ఉన్నా రాజకీయాలు మాత్రం వాడీవేడిగా సాగుతోన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత అవి మరింత రసవత్తరంగా మారాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ నలుగురు ఎమ్మెల్యేలను అధికార వైసీపీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా మరో వైసీపీ కార్యకర్త ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు బలవంతంగా అక్రమ కేసులు పెట్టించారని వైసీపీ కార్యకర్త మాట్లాడుతున్న ఆడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో... ఏర్పేడు జడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య నెలకొన్న వివాదంలో.. పాత వీరాపురానికి చెందిన వైసీపీ కార్యకర్త దామోదరరెడ్డి గాయపడినట్టు ఆస్పత్రిలో చేర్చారు. దీనిపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. అదే రోజు దామోదర్ రెడ్డి, మరో వ్యక్తితో కలిసి పోలీసు స్టేషన్‌లో SC...ST దాడి కేసులు నమోదు చేశారు. దీంతో భయాందోళనకు గురైన టీడీపీ నేతలు రహస్య ప్రాంతాలోకి వెళ్లారు. అయితే వైసీపీ నేతలు తన దగ్గర నుంచి ఉద్దేశపూర్వకంగానే టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టించారని.. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని దామోదర్ రెడ్డి టీడీపీ నేతతో మాట్లాడుతున్న ఆడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తుంది. అందులో వైసీపీపై పెద్ద ఎత్తున విమర్శలు చేయటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.