Tiger in Srisailam: శ్రీశైలం అడవుల్లో మరోసారి పెద్దపులి సంచారం
🎬 Watch Now: Feature Video
Tiger in Srisailam Forest: శ్రీశైలం అడవుల్లో మరోసారి పెద్దపులి కలకలం రేపింది. రాత్రిపూట విధులు నిర్వహిస్తున్న అటవీశాఖ సిబ్బందికి పులి కనిపించటంతో వారు అప్రమత్తమయ్యారు. అటవీశాఖ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి సమయంలో విధుల నిమిత్తం అడవిలో వెళ్తున్న సమయంలో.. శ్రీశైలం క్షేత్రానికి సమీపంలోని సాక్షి గణపతి ఆలయం మలుపు వద్ద పులి కనిపించినట్లు తెలిపారు. వాహనంలో వెళ్తున్నప్పుడు వారికి రోడ్డు పక్కన పులి కనిపించిందని.. దానిని గమనించి వాహనాన్ని రోడ్డుపై నిలిపివేసినట్లు వివరించారు. ఆ సమయంలో పులి రోడ్డు దాటి చెట్ల పొదల్లోకి వెళ్లిపోయిందన్నారు. శ్రీశైలం వచ్చే యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ రేంజ్ అధికారి నరసింహులు తెలిపారు. గతంలో కూడా ఇదే సాక్షి గణపతి ఆలయ ప్రదేశంలో శ్రీశైలం యాత్రికులకు పులి కనిపించింది. తర్వాత గత నవంబర్లో పగటిపూట రోడ్డు దాటుతూ పెద్దపులి కనిపించింది. ఇలా తరచూ పులులు కనిపిస్తుండటం పులుల సంఖ్య పెరుగుతోందని అనటానికి బలం చేకూర్చే అంశమని అటవీశాఖ అధికారులు వివరించారు.