ఏపీకి సంక్రాంతి కానుక - మూడు రైళ్లు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి - ap trains

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 11, 2024, 4:57 PM IST

Updated : Jan 11, 2024, 5:11 PM IST

Three trains will start tomorrow in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ కు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో మూడు రైళ్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. గుంటూరు రైల్వే స్టేషన్ నుంచి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. హుబ్బల్లి - నర్సాపూర్, విశాఖపట్టణం - గుంటూరు, నంద్యాల - రేణిగుంట రైళ్లను ఈ నెల 12న సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభించనున్నట్లు పేర్కొంది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమర్థవంతమైన నాయకత్వంలో దేశంలో రైల్వేలు గణనీయమైన ప్రగతిని సాధించాయి. సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణాన్ని ప్రజలకు అందించాలని అనేక మార్పులకు రైల్వే శ్రీకారం చుట్టింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సమయానుగుణంగా అనేక మార్పులు చేసుకుంటూ, ప్రతి సంవత్సరం వృద్ధిని నమోదు చేసుకుంటూ భారతీయ రైల్వే ముందుకు సాగుతోంది. ప్రయాణికుల సౌకర్యార్థం అనేక కొత్త రైళ్లను ప్రవేశపెట్టడమే కాకుండా, ఇది వరకే నడుస్తున్న అనేక రైళ్ల గమ్యస్థానాలను పొడిగిస్తూ వస్తోంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో పలు రైళ్లను ప్రారంభించనుంది.

నర్సాపూర్-హుబ్లి మధ్యన నడవనున్న 17225/17226 రైలు విజయవాడ - నర్సాపూర్ మధ్యన ఉన్న గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం, పాలకొల్లు స్టేషన్లలో ఆగనుంది. నంద్యాల - రేణిగుంట మధ్యన నడవనున్న 07285/07284 రైలు కడప - రేణిగుంట మధ్యన ఉన్న ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, ఓబులవారిపల్లి, కోడూరు, బాలపల్లె స్టేషన్లలో ఆగనున్నట్లు తెలిపింది. విశాఖపట్టణం - గుంటూరు మధ్యన 22701/22702 రైలు నడవనుంది. ఈ రైళ్లను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ నెల 12 వ తేదీన సాయంత్రం 4 గంటలకు గుంటూరు నుంచి ప్రారంభించనున్నారు. ఇందులో విశాఖపట్టణం - గుంటూరు రైలును నేరుగా ప్రారంభించనుండగా, హుబ్లి - నర్సాపూర్, నంద్యాల - రేణిగుంట రైళ్లను వర్చువల్​గా ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో రైల్వే శాఖ పేర్కొంది. 

Last Updated : Jan 11, 2024, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.