CBN comments: 'నేను పర్యటిస్తుంటే ధాన్యాన్ని తరలించేస్తున్నారు.. కౌలు రైతుల పరిస్థితి ఏంటి సీఎం' - Tdp cheif cbn news
🎬 Watch Now: Feature Video
Telugu Desam Party chief Chandrababu comments: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నేత అయిన నారా చంద్రబాబు నాయుడు.. నేడు ఉభయ గోదావరి జిల్లాల్లో అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన.. రామచంద్రాపురం మండలం వేగయ్యమ్మపేటకు వస్తున్న సందర్భంగా రాత్రికి రాత్రే రోడ్లపైన.. రహదారి పక్కన.. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని తరలించాలని ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో తెల్లవారుకుండానే అధికారులు ధాన్యాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. రోడ్డు పక్కనున్న ధాన్యాన్ని గోనెసంచెల్లో నింపి, వెంట వెంటనే టాక్టర్లపై తరలించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడికి రైతులు ధన్యవాదాలు తెలిపారు. వారం రోజులుగా ధాన్యాన్ని కోనుగోలు చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని..చంద్రబాబు రాకతో తమ ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేశారని ఆనందం వ్యక్తం చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు పర్యటించారు. రామచంద్రాపురం నుంచి వేగయ్యమ్మపేటకు బయల్దేరిన ఆయన.. తడిసి ముద్దయిన వరి పంటలను పరిశీలించారు. అనంతరం గోదావరి జిల్లాల్లోని రైతుల పంటలు అకాల వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్నా కూడా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. ప్రభుత్వానికి అహంకారం తప్ప రైతులను ఆదుకుందామన్న ధ్యాసే లేదని దుయ్యబట్టారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..'' నేను పర్యటిస్తుంటే ధాన్యాన్ని పొలాల నుంచి తరలించేస్తున్నారు. కౌలు రైతులకు తెలుగుదేశం కార్యకర్తలు అండగా నిలవాలి. ఎన్ని కేసులు పెట్టినా రైతులకు అండగా ఉండాలి. అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇంకా 40 నుంచి 50 శాతం పంట కల్లాలు, చేల్లోనే ఉంది. రైతులను ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా?. ధాన్యం తడిసిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కౌలు రైతుల పరిస్థితి ఏంటని సీఎంను నేను ప్రశ్నిస్తున్నా?.'' అని ఆయన అన్నారు.