రా కదలి రా సభ వాయిదా - సీఈసీ బృందాన్ని కలవనున్న బాబు, పవన్ - Pawan Kalyan
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 6, 2024, 9:53 PM IST
|Updated : Jan 7, 2024, 7:05 AM IST
TDP Raa Kadalira Meeting in Venkatagiri Postponed: ఎన్నికలు సమీపిస్తుండటంతో 'రా కదలిరా' పేరుతో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈనెల 9వ తేదీన వెంకటగిరిలో నిర్వహించాల్సిన ‘రా కదలిరా’ కార్యక్రమం వాయిదా వేసినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu Naidu), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు. ఈ నెల 9న ఉదయం రాష్ట్రానికి విచ్చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఇరు పార్టీల అధినేతలు కలవనున్నారు. దీంతో అదేరోజు ఉదయం వెంకటగిరిలో జరగాల్సిన రా కదలిరా బహిరంగ సభ వాయిదా పడింది. 9వ తేదీ మధ్యాహ్నం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగే బహిరంగ సభ యథాతథంగా కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
సార్వత్రిక ఎన్నికల సంసిద్ధతపై మరోసారి ఏపీ అధికారులతో ఎన్నికల సంఘం బృందం సమావేశం కానుంది. ఈ నెల 9, 10వ తేదీల్లో సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనుప్ చంద్ర పాండే, అరుణ్ గోయెల్ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చే అవకాశం ఉంది. సీఎస్, డీజీపీ సహా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నారు. 2024 ఓటర్ల జాబితా రూపకల్పనతో పాటు తప్పిదాలు, అవకతవకల అంశంపై మరోసారి సమీక్షించనున్నారు. ఈవీఎం ఫస్ట్ లెవల్ చెక్, పలు రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేకంగా ఎన్నికల సంఘం బృందం సమీక్షించనుంది.