పట్టించుకోని ప్రభుత్వం - సొంత నిధులతో టీడీపీ నేత రోడ్డు మరమ్మతులు - venkatapuram lingavalasa road repair by tdp leader
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 13, 2023, 5:39 PM IST
TDP Leader Road Repair with his Own Fund: గోతులమయమైన రహదారిలో ప్రజలు పడుతున్న అవస్థలు చూడలేక టీడీపీ నాయకుడు సత్తిబాబు సొంత నిధులతో రోడ్డు మరమ్మతులు చేయించారు. శ్రీకాకుళం జిల్లా వెంకటాపురం నుంచి పెద్ద లింగవలస వెళ్లే రహదారి 4 గ్రామాలకు కీలకంగా ఉంది. ఈ రహదారి గోతులమయంగా మారడంతో ఇటువైపు ప్రయాణించే గర్భిణిలు, విద్యార్థులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సత్తిబాబు పేర్కొన్నారు.
టీడీపీ నాయకుడు సత్తిబాబు సొంత గ్రామానికి వర్షాకాలం వస్తే రహదారి చెరువును తలపిస్తుండటంతో సొంత నిధులతో మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. కొన్నేళ్లుగా ఈ రహదారి గోతులమయంగా మారినా అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారన్నారు. రాత్రి సమయాల్లో వాహనాలు ప్రమాదానికి గురైన ఘటనలు ఎన్నో ఉన్నాయని సత్తిబాబు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఐదేళ్లు పూర్తి కావస్తున్నా మరమ్మతులు చేపట్టలేదన్నారు. దీంతో గ్రామానికి సొంత నిధులతో మరమ్మతులకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. పనులు మరో మూడు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు సత్తిబాబు స్పష్టం చేశారు. సత్తిబాబును టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావుతో పాటు గ్రామస్థులు అభినందించారు.