TCs to Ganja Addicted Students in Paderu: మత్తుకు బానిసైన విద్యార్థులు.. టీసీలిచ్చి పంపించిన పాఠశాల యాజమాన్యం - అల్లూరి జిల్లా తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 29, 2023, 5:50 PM IST
TCs to Ganja Addicted Students in Paderu : గంజాయి లాంటి మత్తు పదార్థాలపై ప్రభుత్వం ఎన్ని నిషేధాజ్ఞలు పెట్టినా.. అవి ఏదో ఒక విధంగా చేరాల్సిన చోటుకి చేరుతున్నాయి. యువతే కాదు పాఠశాల విద్యార్థులు కూడా మత్తు పదార్థాలకు బానిసలై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గంజాయి లాంటి వాటికి అలవాటు పడి విద్యార్థులు బంగారం లాంటి భవిష్యత్‌ను అదిలోనే అంతం చేసుకుంటున్నారు. పాడేరు గిరిజన సంక్షేమ పాఠశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థుల పరిస్థితి కూడా ఇలానే జరిగింది. మత్తు పదార్థాలకు బానిస అవ్వటం వల్ల వారికి పాఠశాల యాజమాన్యం టీసీలు ఇచ్చి పంపించింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు పాఠశాల ఆవరణలోనే గంజాయి, మద్యం సేవించేవారు. మద్యం సేవించటమే కాకుండా తోటి విద్యార్థులను ఇబ్బంది పెట్టడం, బెదిరించి డబ్బులు లాక్కోవడం చేసేవారు. పలుమార్లు విద్యార్థుల్ని పాఠశాల యాజమాన్యం హెచ్చరించినా పరిస్థితి మారలేదు. గతంలో తల్లిదండ్రులు పిలిపించి విద్యార్థుల గురించి చెప్పి హామీ కూడా రాయించుకున్నారు. అయినా వారిలో ఎలాంటి మార్పు కనిపించకపోవటం వల్ల.. వాళ్లకు టీసీలు ఇచ్చినట్లు ప్రధానోపాధ్యాయుడు తల్లిదండ్రులకు వివరించాడు.