Student Unions Protest for Teachers Beat Student: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు.. ఫోన్ తెచ్చాడని విద్యార్థిని చితకబాదిన లెక్చరర్లు
🎬 Watch Now: Feature Video
Students Unions Protest for Teachers Beat Students: అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని లెక్చరర్లు కొట్టడాన్ని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఫ్ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థిని చితకబాదిన లెక్చరర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. రాయదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తాను సెల్ ఫోన్లో వీడియోలు, ఫొటోలు తీశాడని కళాశాల ప్రిన్సిపల్ వీరేష్, అధ్యాపకులు శ్రీనివాసులు, ఆజాద్ ఒకరి తర్వాత ఒకరు తనను చితక్కొట్టినట్లు ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఇషాక్ వాపోయాడు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల వద్దకు చేరుకుని.. ప్రిన్సిపల్ వీరేష్‌ను వెంటనే సస్పెండ్ చేసి.. క్రిమినల్ కేసు నమోదు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. కళాశాలలో అధ్యాపకులు బహుమతులు అందించగా.. ఇషాక్ ఇంటి నుంచి తెచ్చుకున్న సెల్‌ఫోన్ బయటకు తీసి ఫొటోలు, వీడియోలు తీయడంతో కళాశాల యాజమాన్యం మండిపడింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు విద్యార్థిపై దాడి చేయడం నేరంగా వారు పేర్కొన్నారు. విద్యార్థి సంఘాల నాయకులను కళాశాలలోకి రాకుండా ప్రిన్సిపల్ వీరేష్ అడ్డుకోవడంపై వారు మండిపడ్డారు. ప్రభుత్వం కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్‌ను, అధ్యాపకులను వెంటనే సస్పెండ్ చేయాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని విద్యార్థి సంఘం నాయకులు హెచ్చరించారు.