Somu Veerraju on Volunteers: వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలి: సోము వీర్రాజు - ఏపీలో మానవ అక్రమ రవాణా
🎬 Watch Now: Feature Video
Somu Veerraju Comments on Volunteer system: రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా వాలంటీర్ వ్యవస్థ వల్లే జరుగుతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారమే రేపుతోంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ సైతం పవన్ చేసిన వ్యాఖ్యలకు పది రోజుల్లో సమాధానం ఇవ్వాలని.. లేకుంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ వ్యాఖ్యలకు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు బలం చేకూరినట్లైయ్యాయి. వాలంటరీ వ్యవస్థ రాజకీయ ధృక్కోణంతో ఏర్పాటైన వ్యవస్థ అని.. ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రయత్నించే వ్యవస్థ అని సోము అన్నారు. వాలంటరీ వ్యవస్థ రాజ్యాంగబద్ధమైన అంశం కాదని.. భారతదేశంలో ఎక్కడా లేదని.. ఆ వ్యవస్థ వెంటనే తీసేయాలని డిమాండ్ చేశారు. ఇది ప్రమాదకరమైన వ్యవస్థని సోము అభిప్రాయపడ్డారు.
ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టి వాలంటరీ వ్యవస్థను నడుపుతున్నారని.. రాజ్యాంగ, చట్టపరంగా ఇది సరైన విధానం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. శాసన మండలిలోనూ వాలంటరీ వ్యవస్థపై చర్చించినట్లు స్పష్టం చేశారు. 30-40 మందికి ఓ వ్యక్తిని పెడితే వారి వద్ద ఏ సమాచారమైన ఉంటుందని.. అది చాలా ప్రమాదకరమైన వ్యవస్థ అని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హేతుబద్ధమైన నిర్ణయం కాదని స్పష్టం చేశారు. మహిళల అక్రమ రవాణాపై పవన్ వద్ద ఉన్నా ఆధారాల్ని ఇస్తే.. కేంద్ర సంస్థలు స్పందిస్తాయని చెప్పారు. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా తొలిసారి రాజమహేంద్రవరం వచ్చిన సోముకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.