Jasti Krishna Kishore as Chief commissioner of IT జాస్తి కృష్ణ కిషోర్‌కు ఆదాయ పన్ను చీఫ్ కమిషనర్‌గా పదోన్నతి - IRS officer Jasti Krishna Kishore news
🎬 Watch Now: Feature Video
Central Govt promoted Jasti Krishna Kishore: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధి మండలి (ఈడీబీ) సీఈవోగా విధులు నిర్వర్తించిన సీనియర్ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్‌కు కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను చీఫ్ కమిషనర్‌గా పదోన్నతి కల్పించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌లో బాధ్యతలు చేపట్టాలని ఆదేశిస్తూ.. కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జాస్తి కృష్ణ కిషోర్.. త్వరలోనే దేశ రాజధాని దిల్లీలో ఉన్న ప్రత్యక్ష పన్నుల బోర్డులో బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే, ఈ జాస్తి కృష్ణ కిషోర్ ఎవరు..?, వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృష్ణ కిషోర్‌పై ఏ కేసు నమోదు చేసింది..? కృష్ణ కిషోర్ విషయంలో క్యాట్ ఏ నిర్ణయం తీసుకుంది..? అనే వివరాలను పరిశీలిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
జాస్తి కృష్ణ కిషోర్... 1990 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్(IRS) తెలుగు అధికారి. ప్రస్తుతం ఆయన భువనేశ్వర్‌లో ప్రిన్సిపల్ ఇన్‌కం ట్యాక్స్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2014వ సంవత్సరం నుంచి 2019 వరకూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి బోర్డ్‌కి సీఈవోగా పని చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో ఈడీబీ సీఈవోగా పని చేసిన కృష్ణ కిశోర్‌పై అవినీతి ఆరోపణలు వచ్చాయంటూ ఆయనను సస్పెండ్ చేసింది. అంతేకాకుండా, కృష్ణ కిశోర్ ఈడీబీ సీఈవోగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగం జరిగిందని, ప్రభుత్వ అనుమతి లేకుండానే రూ.కోట్ల విలువైన ప్రకటనలు జారీ చేశారంటూ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. సీఐడీ, అ.ని.శా డీజీలు దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణ పూర్తయ్యే వరకు కృష్ణ కిశోర్ అమరావతి విడిచి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ.. కృష్ణ కిశోర్ క్యాట్‌ను ఆశ్రయించగా.. క్యాట్ ఆయనపై సస్పెన్షన్ చెల్లదంటూ కేసును కొట్టివేసింది. ఆయన తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్ అనుమతిచ్చింది.