Sachin: అరుదైన అవకాశం.. సచిన్ బర్త్‌డే వేడుకల్లో మార్కాపురం యువకుడు - క్రికెట్ దేవుడు సచిన్
🎬 Watch Now: Feature Video
Sachin Invited Markapuram Boy : సచిన్ తెందుల్కర్.. ఆయనో క్రికెట్ దిగ్గజం.. ఆయనంటే అభిమానం లేనివాళ్లు ఉండరు.. సచిన్‌ను చూడాలని.. కలవాలని ఎంతోమంది కోరుకుంటారు.. అలాంటిది కలిసే అవకాశం వస్తే ఆ ఆనందానికి హద్దే ఉండదు.. అలాంటి అదృష్టమే మన రాష్ట్రానికి చెందిన యువకుడికి దక్కింది.. ఈ నెల 24న సచిన్ తెందుల్కర్ 50వ జన్మదినం జరుపుకున్నారు. అర్ద శతకంలో అడుగుపెట్టిన సందర్భంగా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా తనకున్న వీరాభిమానులలో కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించారు. అందులో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన 23 ఏళ్ల శశిధర్ రెడ్డికి ఆహ్వానం లభించింది.
ఇంజినీరింగ్ చదువుతున్న శశిధర్ క్రికెట్ పట్ల ఆసక్తితో.. ఓ శిక్షణా కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్నాడు. సచిన్‌పై ఉన్న అభిమానంతో తన 9వ తరగతి నుంచే సచిన్ బయోగ్రఫీ రాయడం మొదలు పెట్టాడు. సోదరి సౌమ్యారెడ్డి, తల్లిదండ్రులు వెంకటేశ్వర రెడ్డి, విజయలక్ష్మి సహకారంతో పురాతన చిత్రాలతో 200 పేజీల పుస్తకాన్ని పూర్తి చేశాడు. శశిధర్.. సచిన్ పై ఆసక్తిని.. సామాజిక మాధ్యమాల్లో తన అభిమానాన్ని ఎక్కువగా పంచుకునేవారు. సచిన్ తన అభిమానుల కోసం 100 ఎంబీ పేరుతో ఓ యాప్ విడుదల చేశారు. అందులో దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో వంద మందిని ఎంపిక చేయగా.. రాష్ట్రానికి చెందిన శశిధర్ రెడ్డికి అవకాశం లభించింది.
ఈ నెల 24న జరిగిన సచిన్ జన్మదిన వేడుకలకు శశిధర్ హాజరయ్యాడు. ఆ కార్యక్రమంలో యువకుడు రాసిన పుస్తకాలను సచిన్ ప్రత్యేకంగా పరిశీలించారు. శశిధర్‌ను హత్తుకొని అభినందించారు. లెజెండరీ సచిన్ తెందుల్కర్ పుట్టినరోజు కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల యువకుడితో పాటు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: