సీఎం జగన్ కడపకు - కడప జనం నగర శివారుకు 'ఇదేంది జగనన్నా? - కడపలో సీఎం పర్యటన ఆంక్షలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 23, 2023, 2:36 PM IST
RTC Buses Diverted From Bus Stand in Kadapa: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా సామన్య ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోంది. ఆయన పర్యటన ఉందంటే చాలు పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. చివరకి ఈ ఆంక్షల విధింపు ఏ స్థాయికి చేరిందంటే చివరకి ఆర్టీసీ బస్టాండ్‌లోకి బస్సులు వెళ్లకుండా చేసి దారి మళ్లించే వరకు. అంతేకాకుండా సీఎం వస్తున్నారని పరదాలు, బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను ముఖ్యమంత్రి పర్యటన ప్రాంతాల వద్ద ఏర్పాటు చేస్తున్నారు.
కడప నగరంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శనివారం పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌లోకి బస్సులు రాకుండా అధికారులు దారి మళ్లించారు. పలు జిల్లాల నుంచి కడపకు వచ్చే ఆర్టీసీ బస్సులన్నీ శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ చేసిన స్థలాల్లోనే ఆగిపోతున్నాయి. బస్టాండ్‌లోకి బస్సులు రావనే విషయం తెలియక చాలామంది ప్రయాణికులు బస్టాండ్ ప్రాంగణానికి వచ్చి వెనుతిరుగుతున్నారు. శివారు ప్రాంతాల్లో బస్సులు నిలిపివేయడంతో అక్కడికి చేరుకోవడానికి ప్రైవేేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోందని, దీనివల్ల అధిక ఛార్జీలు వెచ్చించాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కడప ఆర్టీసీ బస్టాండ్ నిర్మానుష్యంగా మారిపోయింది. కడప నగరంలోని అంబేద్కర్ కూడలి, వై జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, 7 రోడ్ల కూడలిని ఇటీవల నూతనంగా అభివృద్ధి చేశారు. శనివారం ముఖ్యమంత్రి వాటిని ప్రారంభించనున్నారు. అయితే ఉదయం నుంచే ఆర్టీసీ అధికారులు నగరంలోకి బస్సులు రాకుండా నిలిపివేశారు.