Rottela Panduga: బారాషహీద్ దర్గా వద్ద వేడుకగా గంధమహోత్సవం.. పోటెత్తిన భక్తజనం - Nellore news
🎬 Watch Now: Feature Video
Barashahid Dargah Rottela panduga: నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండగకు భక్తులు భారీగా తరలివచ్చారు. సర్వ మతాలకు చెందినవారు రావడంతో బారాషహీద్ దర్గా ప్రాంగణం కిక్కిరిసింది. నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగలో ప్రధాన ఘట్టమైన గంధమహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ గంధమహోత్సవాన్ని తిలకించేందుకు అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. కోటమిట్టలోని అమీనియా మసీదులో బారాషహీద్‌లకు 12 బిందెల్లో గంధం వేసి అత్తరుతోపాటు వివిధ రకాల సుగంధద్రవ్యాలు, గులాబ్ నీటితో కలిపారు. పూలతో అలంకరించిన ప్రత్యేక మినీ లారీలో బిందెలు ఎత్తుకున్న 12 మంది కూర్చోగా, పలువురు మతపెద్దలు జెండాలతో ముందువైపు నడిచారు. అక్కడ నుంచి ఫకీర్ల విన్యాసాల మద్య బారాషాహిద్ దర్గాకు గంధాన్ని తీసుకువెళ్లారు.. గంధమహోత్సవానికి విచ్చేసిన కడప పీఠాధిపతి ఆరీఫుల్లా హుస్సేని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, గంధాన్ని బారాషాహిద్ సమాధులకు లేపనం చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన భక్తులు గంధాన్ని అందుకునేందుకు పోటీపడ్డారు. దారి పొడవునా విన్యాసాలు, గీతాలాపనలు, బాణసంచా మధ్య ఊరేగింపు సాగింది.