Road Construction in One Night: పవన్ పర్యటన.. అవనిగడ్డలో రాత్రికి రాత్రే రహదారి నిర్మాణం.. - యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మించేసిన అధికారులు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 1, 2023, 3:52 PM IST
Road Construction in One Night: కృష్ణా జిల్లా మోపిదేవి వార్పు మార్గంలో రాత్రికి రాత్రే రోడ్డు వెలిసింది. నిన్నటి వరకు మోపిదేవి వార్పు నుంచి గుంటూరు జిల్లా పెనుముడి వరకు జాతీయ రహదారిపై భారీ గుంతలు ఉండేవి. మరమ్మతులకు నోచుకోక అడుగుకో గొయ్యి.. గజానికో గుంతలా రహదారంతా అధ్వానంగా ఉండేది. ఈ దారిలో ప్రయాణమంటేనే నరకప్రాయంగా ఉంటుందంటూ.. దీనిపై ప్రయాణించేందుకు వాహనదారులు భయపడేవారు. అధికారుల నిర్లక్ష్యంతో అధ్వానంగా తయారైన ఈ రహదారిపై అనేక మంది పలుమార్లు ప్రమాదాల బారిన పడ్డారు. కాగా.. 3 నెలల క్రితం కొత్త రోడ్డు వేస్తామంటూ అధికారులు అంతా తవ్వేసి అలానే వదిలేశారు. దీంతో ఆ రహదారిపై ప్రయాణించిన వాహనదారులు.. దుమ్ము, ధూళితో అనేక ఇబ్బందులు పడ్డారు. కాగా వారాహి యాత్ర కోసం ఇవాళ జనసేన అధినేత పవన్ అవనిగడ్డ వస్తున్నారని తెలుసుకున్న అధికారులు యుద్ధ ప్రాతిపదికన రాత్రికి రాత్రే ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మించేశారు.