Protest to YCP MLA Kangati Sridevi: టీడీపీ కంచుకోటలో 'గడప గడపకు మన ప్రభుత్వం'.. ఎమ్మెల్యే శ్రీదేవిని అడ్డుకున్న గ్రామస్థులు - గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వార్తలు
🎬 Watch Now: Feature Video
Protest to YCP MLA Kangati Sridevi : వైఎస్సార్సీపీ నాయకులు నిర్వహిస్తోన్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నిరసనలు వెల్లువెత్తడం, వైసీపీ నేతలను అడ్డుకోవడం సర్వసాధారణం అయిపోయింది. ఇటువంటి తరుణలో వైసీపీ మహిళా ఎమ్మెల్యే సాహసం చేసి టీడీపీ కంచుకోటైన గ్రామాలకు వెళ్లారు అంతే ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి చేదు అనుభవం ఎదురైంది. పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ఈ తరుణంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఖాసీంస్వామి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతలోనే మహిళలు, గ్రామస్థులు, టీడీపీ అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీదేవికి వ్యతిరేకంగా నినాదాలు పెద్ద ఎత్తున చేశారు. 'గ్రామానికి ఏం చేశారని గడప గడపకు వచ్చారు? గో బ్యాక్, డౌన్ డౌన్ ఎమ్మెల్యే అంటూ నినాదాలు చేశారు. గొడవలు జరిగే అవకాశం ఉందని ముందే సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద ఎత్తున గ్రామానికి చేరుకున్నారు.
ఒక్కసారిగా గ్రామస్థులు అక్కడికి దూసుకు రావటంతో అప్రమత్తమైన పోలీసులు ఎమ్మెల్యేకు రక్షణ వలయంగా నిలబడి గ్రామస్థులను చెదరగొట్టారు. తమ కాలనీలోకి రావద్దని నినాదాలు చేస్తూ.. ముళ్ల కంపలు అడ్డుగా పెట్టారు. ఎమ్మెల్యే ఎస్సీ కాలనీలోకి వెళ్లారు. అక్కడ టీడీపీ, వైసీపీ వర్గాలు వారు రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారంటంతో పోలీసుల భారీ బందోబస్తు నడుమ కార్యక్రమం జరిగింది. పోలీసులు ఎమ్మెల్యేకు రక్షణగా నిలిచారు. వీధి వీధికి వెళ్లే మార్గంలో గ్రామస్థులకు పోలీసులు అడ్డుగా నిలిచారు. కోపోద్రిక్తులైన గ్రామస్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఒక్క రోడ్డు, మురుగు కాల్వ నిర్మించిన దాఖలాలు లేవని గ్రామస్థులు ఆరోపించారు. టీడీపీ కంచుకోటగా ఉన్న తమ గ్రామంలో వైసీపీ నాయకులు పర్యటించే హక్కు లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి అక్కడి నుంచి వెళ్లిపోవడంలో ఉద్రిక్త వాతావరణం సాధారణ స్థితికి వచ్చింది.