Kilari Rosaiah Vs Dhulipalla: నియోజకవర్గ అభివృద్ధికి ధూళిపాళ్ల అడ్డుపడుతున్నారు: ఎమ్మెల్యే రోశయ్య - YSRCP MLA Kilari Venkata Roshaiah comments
🎬 Watch Now: Feature Video
YSRCP MLA Roshaiah Hot Comments on TDP Leader Dhulipalla: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌పై పొన్నూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సంగం డెయిరీ ఎదుట నిలబడి పొన్నూరు నియోజకవర్గానికి తెలుగుదేశం దుష్ప్రచారాల పార్టీ అధ్యక్షుడు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అంటూ వ్యాఖ్యానించారు. సంగం డెయిరీని అడ్డుపెట్టుకొని.. గత 25ఏళ్లుగా ధూళిపాళ్ల నరేంద్ర ఎమ్మెల్యేగా ఉండి, నియోజకవర్గానికి ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేదని విమర్శించారు. పొన్నూరులోని ఆటోనగర్, వడ్లమూడి బాలకోటేశ్వరస్వామి ఆలయాల పునఃనిర్మాణం జరగకుండా కోర్టులో కేసులు వేశారంటూ దుయ్యబట్టారు. ఇప్పుడు పొన్నూరులో జరిగే రోడ్డు విస్తరణ పనులపై కూడా కోర్టులో కేసు వేస్తామంటూ హెచ్చరిస్తున్నారని మండిపడ్డారు.
చరిత్రహీనుడుగా పేరు తెచ్చుకుంటారు.. నారా కోడూరులో శనివారం జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య.. వడ్లమూడి వెళ్తు మార్గమధ్యంలో సంగం డెయిరీ వద్ద ఆగారు. డెయిరీని చూపిస్తూ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ''పొన్నూరు నియోజకవర్గానికి తెలుగుదేశం దుష్ప్రచారాల పార్టీ అధ్యక్షుడిగా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఉన్నారు. గత 25 సంవత్సరాలుగా సంఘం డెయిరీని అడ్డం పెట్టుకొని నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని చేయలేదు. పొన్నూరులో ఆటోనగర్, వడ్లమూడి బాలకోటేశ్వరస్వామి ఆలయాల పునఃనిర్మాణం చేస్తుంటే వాటిని జరగకుండా కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం పొన్నూరులో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులపై కూడా కోర్టులో కేసు వేస్తానంటూ బెదిరిస్తున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకపోయినా ఫర్వాలేదు గానీ పనులు చేస్తుంటే అడ్డుకుంటున్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో చరిత్రహీనుడుగా పేరు తెచ్చుకుంటారు'' అంటూ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.