POCSO Case on Teachers: విద్యార్థినులపై ఉపాధ్యాయుల లైగింక వేధింపులు.. పాఠశాల వద్ద ఆందోళన - ఇద్దరి విద్యార్థినులపై ఉపాధ్యాయుల లైగింక వేధింపులు
🎬 Watch Now: Feature Video
Teachers Sexual Harassment on Girls : తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం బంగారుపేట ప్రాథమికోన్నత పాఠశాలలో బాలికల పట్ల ఉపాధ్యాయులు అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వరుసగా రెండో రోజు మరో ఉపాధ్యాయుడిపై ఆరోపణలు రావడంతో పాఠశాల దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గురువారం వెంకటగిరి పట్టణం బంగారుపేట బీసీ కాలనీలోని ప్రీహైస్కూల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుడు కటికాల వెంకటేశ్వర్లుపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరసింహారావు తెలిపారు. రెండో తరగతి చదువుతున్న బాలిక కొన్ని రోజులుగా పాఠశాలకు వెళ్లనని మారాం చేస్తుండటంతో.. తల్లిదండ్రులు ఆరా తీశారని,.. ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు బాలిక చెప్పడంతో తల్లిదండ్రులు హెచ్ఎం నరేష్‌కు ఫిర్యాదు చేశారన్నారు. సచివాలయం మహిళా పోలీస్, తల్లిదండ్రుల సమక్షంలో ఉపాధ్యాయుడిని విచారించి స్టేషన్‌కు తరలించామని, బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.
శుక్రవారం ఉదయం లక్ష్మీ నారాయణ అనే ఉపాధ్యాయుడు 7వ తరగతి బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, స్థానికులు చేరుకుని ఆ మాస్టార్‌కు దేహశుద్ది చేశారు. ఎంఈఓ అక్కడికి చేరుకొని విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. ఉపాధ్యాయులకు రాతపూర్వకంగా నోటీసులు అందజేసి అందరి సంతకాలు తీసుకోవడం జరిగిందని అన్నారు. వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ గురించి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఈ క్రమంలో వారిని సస్పెండ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే మరో ఉపాధ్యాయుడిని కూడా బదిలీ చేస్తామని వారికి తెలిపారు. పోలీసులు చేరుకుని ఉపాధ్యాయుడిని అక్కడ నుంచి ఆటోలో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.