People suffered in CM Meeting: సీఎం ప్రసంగానికి ముందే.. ఎటు దారి కనిపిస్తే అటు వెళ్లిపోయిన జనం - బాపట్ల జిల్లాలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసా సమావేశం
🎬 Watch Now: Feature Video
People face difficulties in CM meeting: ముఖ్యమంత్రి సభకు హాజరైన వృద్ధులు, మహిళల బాధలు వర్ణణాతీతం. సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఎండ, వేడికి ఉండలేక సభ జరుగుతుండగానే చాలామంది వెనుదిరిగారు. ఉదయం తీసుకొచ్చేప్పుడు హడావిడి చేసిన నేతలు.. ఆ తర్వాత పట్టించుకోలేదంటూ వాపోయారు. మరోవైపు జిల్లాలో ఉన్న బస్సులన్నీ సీఎం సభకు తీసుకెళ్లడంతో.. సామాన్య ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సభ ఏదైనా కానీ ముఖ్యమంత్రి మాట్లాడటం మొదలు పెడితే చాలు జనం వెళ్లిపోవడం సర్వ సాధారణమైపోయింది. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జరిగిన మత్స్యకార భరోసా సభలోనూ ఇదే తంతు నడిచింది. సీఎం వస్తున్నారని ఆర్భాటంగా ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు పెట్టి జనాలను తరలించారు. అయితే సభా ప్రాంగణం లోపల సరైన ఏర్పాట్లు లేకపోవడంతో జనం తిరుగుపయనమయ్యారు. ముఖ్యమంత్రి జగన్ మట్లాడుతున్న సమయంలో జనం వెళ్లిపోవడం చూసి పోలీసులు వారిని అపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ప్రజలు ఎక్కడ దారి కనిపిస్తే అటు వెళ్లిపోయారు.
ఎండలు ఎక్కువగా ఉండటం, సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో.. సభలో కూర్చునేందుకు జనం ఆసక్తి చూపలేదు. ముఖ్యమంత్రి ప్రసంగం వినకుండానే వెళ్లిపోయారు. సభకు రాకపోతే సంక్షేమ పథకాలు తొలగిస్తామని హెచ్చరించడంతో గత్యంతరం లేక వచ్చామని.. తీరా ఇక్కడికి వచ్చాక సౌకర్యాలు కల్పించలేదన్నారు. ఆరోగ్యం బాగోలేదన్న వినిపించుకోలేదని తప్పనిసరిగా రావాల్సిందేనని పట్టుబట్టారన్నారు.
ముఖ్యమంత్రి సభ కోసం 250 ఆర్టీసీ బస్సులను తరలించడంతో.. సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఊర్లకు వెళ్లేందుకు పెద్దఎత్తున ప్రజలు బస్టాండ్‌లలో గంటల తరబడి వేచి ఉన్నారు. వచ్చిన అరకొర బస్సుల్లోనే నిల్చుని అతికష్టం మీద ప్రయాణం సాగించారు. తీవ్ర ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.