Payyavula Keshav on Votes Deletion: ఏడు వేల ఓట్లు తొలగించారు.. కలెక్టర్‌కు పయ్యావుల కేశవ్ ఫిర్యాదు
Payyavula complaint against cancellation of TDP sympathy votes: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు విషయంలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ప్రభుత్వ యంత్రాంగంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని.. మాజీ మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపుపై బల్క్ అప్లికేషన్లు తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్‌కు లేదని పయ్యావుల దుయ్యబట్టారు. ఓట్ల తొలగింపు అంశం చట్ట విరుద్దమని గుర్తు చేస్తూ.. కలెక్టర్ గౌతమిని కలిసి ఫిర్యాదు చేశారు.
టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపుపై కలెక్టర్‌కు ఫిర్యాదు.. మాజీ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ.. '' కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్దంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్న ప్రతి అధికారి బాధ్యత వహించాలి. గతకొన్ని రోజులుగా ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఇటీవలే ఏడు వేల మంది ఓట్లను తొలగించాలని అభ్యర్థన ఇస్తే, అధికారులు వెంటనే అమలు చేశారు. ఫారం 7 నిబంధనల లేకుండా ఓట్లు ఎలా తొలగిస్తారు..?. బల్క్ ఓట్ల తొలగింపు అభ్యర్థనలు తీసుకోరాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది కదా. నిబంధనలను ఉల్లఘించి జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ ఎలా ఓట్లు తొలగిస్తారు..? గత ఏడాది ఉరవకొండ నియోజకవర్గంలో ఆరు వేలమంది టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించారు. దాంతో నేను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాను. ఈ ఏడాది కూడా మళ్లీ ఓట్లను తొలగించడం ప్రారంభించారు. ఈ వ్యవహారంపై గత తొమ్మిది నెలలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈసారి ఏకంగా ఏడు వేల ఓట్లను తొలగించారని కలెక్టర్ తెలియజేస్తూ.. ఫిర్యాదు చేశాను'' అని ఆయన అన్నారు.