Payyavula Keshav on Votes Deletion: ఓట్ల తొలగింపుపై మా పోరాటం ఫలించింది.. అధికారుల సస్పెన్షన్ ఆరంభం మాత్రమే: పయ్యావుల
🎬 Watch Now: Feature Video
Payyavula Keshav on Votes Deletion: అనంతపురం జిల్లా ఉరవకొండలో అక్రమంగా ఓట్లను తొలగించిన వ్యవహారంలో ఇద్దరు అధికారుల సస్పెన్షన్.. ప్రారంభం మాత్రమేనని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. మున్ముందు మరింత మందిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుటుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల అక్రమ తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్న పయ్యావుల.. నిశిత పరిశీలన చేయాలని ఆదేశించిందని చెప్పారు. ఓట్ల తొలగింపుపై తమ పోరాటం ఫలించిందని.. వైసీపీ నేతలు చెప్పినట్టు చేసిన అధికారులు సస్పెండ్ అయ్యారని చెప్పారు. అత్యుత్సాహం చూపిన 8 మంది బీఎల్ఓలు సస్పెండ్ అయ్యారని.. కిందిస్థాయిలో తప్పు చేస్తున్న అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక నుంచైనా అధికారులు జాగ్రత్తగా పనిచేయాలని.. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి ఇబ్బందులు తెచ్చుకోవద్దని కేశవ్ సూచించారు. టీడీపీ ఓట్ల తొలగింపుపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ప్రతి ఓటును పరిశీలిస్తేనే వాస్తవాలు తెలుస్తాయన్న పయ్యావుల.. ఓటును తొలగించేముందు ముగ్గురు సభ్యుల కమిటీ పరిశీలన ఉండాలని అన్నారు. అభ్యంతరం తెలుపుతున్న వ్యక్తిని కూడా తీసుకెళ్లి పరిశీలించాలని కోరారు. పర్సనల్ నోటిఫికేషన్ ద్వారా తెలిపి వివరణ తీసుకుని సంతృప్తి చెందితేనే అప్పుడు తొలగించాలని పేర్కొన్నారు.