Pawan Kalyan Meeting with Sarpanchs: గ్రామీణ ప్రజల డబ్బును దోచుకుంటున్నారు: పవన్
Pawan Kalyan meeting with sarpanchs: పంచాయతీలను కాపాడుకుందాం అనే అంశంపై గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన రాష్ట్ర కార్యాలయంలో చర్చా కార్యక్రమం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన సర్పంచులు పాల్గొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయితీరాజ్ వ్యవస్థను సర్వనాశనం చేశారని... ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. స్థానిక సంస్థల అభివృద్ది కోసం కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం దోడిపీ కాక మరేమిటని ప్రశ్నించారు. పంచాయతీల నిధుల దుర్వినియోగాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళతామన్నారు. జనసేన అధికారంలోకి వస్తే సర్పంచులకు అధికారాలు, నిధులు అందిస్తామని భరోసా ఇచ్చారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానం తప్ప మిగిలిన వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని... జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని మండిపడ్డారు. సర్పంచులుగా ఎన్నికై 30 నెలలు దాటినా నిధులివ్వకుండా, హక్కుల కోసం పోరాడితే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించారని... సర్పంచుల సంఘం అధ్యక్షుడు పాపారావు అవేదన వ్యక్తం చేశారు.
గతంలో సర్పంచ్ అంటే గౌరవం ఉండేదని, వైకాపా ప్రభుత్వం ఆ వ్యవస్థను పూర్తిగా దిగజార్చిందని సర్పంచులు వాపోతున్నారు. ప్రజల ద్వారా ఎన్నికైన తమకంటే వాలంటీరే ఎక్కువనే పరిస్థితి తెచ్చారని ఆవేదన చెందుతున్నారు. నిధులు, విధులు లేక తమ పరిస్థితి దిష్టిబొమ్మల్లా తయారైందని అంటున్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆశయంతో వస్తే.. ప్రభుత్వం తమ నిధులు తీసుకుని మోసం చేస్తోందని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
''పంచాయతీల నిధులను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కేంద్రం చెప్పింది. గ్రామీణ ప్రజలకు చెందిన డబ్బులను దోచుకుంటున్నారు. రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ జరగాలి. గ్రామపాలన కూడా సీఎం కార్యాలయం నుంచే జరగాలనుకోవటం సరికాదు. మన రాష్ట్రంలో ఇంకా రాజు పాలనే సాగుతోంది. స్థానిక సంస్థలకు రాజ్యాంగపరంగా దక్కిన అధికారాలు లేకుండా చేస్తున్నారు. కేంద్రం ఇచ్చే నిధులు నేరుగా సర్పంచ్ ఖాతాలోకి రావాలి. గ్రామ పంచాయతీలకు నిధుల విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తా.'' -పవన్ కల్యాణ్, జనసేన అధినేత