Notices to NGT Petetioner: ఇసుక రీచ్‌లపై పిటిషన్ వేశాడని కక్షసాధింపు.. ప్రభుత్వశాఖల నుంచి వేధింపులు.. అజ్ఞాతంలోకి నాగేంద్ర.. - nagendra went into hiding
🎬 Watch Now: Feature Video
Notices to NGT Petetioner: రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీలో పిటిషన్ వేసిన దండా నాగేంద్రపై.. ప్రభుత్వశాఖల నుంచి వేధింపులు మొదలయ్యాయి. దండా నాగేంద్రకు పల్నాడు జిల్లా అమరావతిలో ఉన్న గెస్ట్‌హౌస్‌కు నోటీసులు జారీ అయ్యాయి. పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అధికారులు.. అతిథి గృహానికి నోటీసులు అంటించారు. గెస్ట్‌హౌస్ అనుమతి లేకుండా నిర్మించారని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై వారంలోగా వివరణ ఇవ్వకపోతే అక్రమ కట్టడంగా భావించి కూల్చివేస్తామని తెలిపారు. పోలీసు కేసులకు భయపడి దండా నాగేంద్ర ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పల్నాడు జిల్లా అమరావతికి చెందిన దండా నాగేంద్ర ఇసుక తవ్వకాలపై ఎన్జీటీలో పిటిషన్ వేశారు. దానికి కంచేటి సాయి అనే వ్యక్తి సహకరించాడు. వీరిద్దరూ గతంలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావుకు అనుచరులుగా ఉండేవారు. ఎమ్మెల్యేతో విభేదాలు రావటంతో వారిని వైసీపీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత నాగేంద్ర ఎన్జీటీలో పిటిషన్ వేశారు. కృష్ణానది గర్భంలో కిలోమీటర్ల పొడవున రహదారులు ఏర్పాటు చేసి పర్యావరణ చట్టానికి తూట్లు పొడుస్తూ భారీ యంత్రాలతో ఇసుక తవ్వుతున్నారని ఆధారాలు అందజేశారు. దీంతో ఇసుక తవ్వకాలు ఆపాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచే వీరిద్దరిపై పోలీసు వేధింపులు మొదలయ్యాయి.